కలం, వెబ్డెస్క్: సినిమా టికెట్ రేట్ల (Movie ticket price) పెంపుపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ది రాజాసాబ్’ సినిమా టికెట్ రేట్లను పెంచడంపై దాఖలైన పిటిషన్ శుక్రవారం ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా పలు వ్యాఖ్యలు చేసింది. పదే పదే రేట్లు ఎందుకు పెంచుతున్నారంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. టికెట్ రేట్లు పెంచొద్దని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోరా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘టికెట్ రేట్లు పెంచబోమని సంబంధిత శాఖ మంత్రి కూడా చెప్పారు. అయినా టికెట్ల రేట్ల పెంపును ఎందుకు అనుమతిస్తున్నారు? తెలివిగా ఎందుకు మెమోలు జారీ చేస్తున్నారు? మొమోలు ఇచ్చే అధికారికి నిబంధనలు తెలియవా?’ అని న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది.
కాగా, ప్రభాస్ హీరోగా నటించిన ‘ది రాజా సాబ్’ ఈ నెల 9న విడుదలైంది. అయితే, ఈ సినిమాకు కొన్ని రోజుల పాటు టికెట్ రేట్లు పెంచమని కోరుతూ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. దీంతో టికెట్ రేట్లను పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ కోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచాతణ జరిపిన న్యాయస్థానం.. ప్రభుత్వం తీరును తప్పుపట్టింది. హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ పదే పదే టికెట్లు పెంచుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.

Read Also: మేడారం జాతరకు 700 బస్సులు.. మహిళలకు ఉచిత ప్రయాణం
Follow Us: Twitter


