కలం, వెబ్ డెస్క్ : అమెరికా సంచలన బిల్లును తేవడానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. దీనికి ‘2025 రష్యాను నిషేధించే చట్టం’ అని పేరు పెట్టింది అమెరికా. ఈ చట్టం అమల్లోకి వస్తే రష్యా నుంచి చమురు, యురేనియం కొనే దేశాల మీద అమెరికా 500 శాతం దాకా టారిఫ్ లు విధిస్తుంది. ప్రస్తుతం రష్యా నుంచి చైనా, భారత్ అత్యధికంగా చమురును కొంటున్నాయి. ఈ చట్టం అమల్లోకి వస్తే ఇండియా మీద కూడా 500 శాతం సుంకాలు విధించే ఛాన్స్ ఉంది. ఈ చట్టం మీద తాజాగా కేంద్ర ప్రభుత్వం (Indian Government) స్పందించింది. భారత విదేశాంగ శాఖ అధికారి ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. ‘ఈ బిల్లు గురించి మాకు అవగాహన ఉంది. జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నాం. చమురు అంశం మీద మా వైఖరి ఏంటో ఇప్పటికే అందరికీ తెలుసు. దేశ ప్రయోజనాలు, ప్రపంచ మార్కెట్ పరిస్థితులను బట్టి చర్యలు తీసుకుంటాం. భారతీయుల ఇంధన భద్రతను కాపాడటం మా బాధ్యత’ అని రణధీర్ తెలిపారు.
అలాగే అమెరికాతో ఇండియా వాణిజ్య ఒప్పందం కోసం గతేడాది డొనాల్డ్ ట్రంప్ తో ప్రధాని నరేంద్ర మోడీ 8 సార్లు ఫోన్ లో మాట్లాడారని రణధీర్ స్పష్టం చేశారు. ట్రంప్ తో నరేంద్ర మోడీ నేరుగా మాట్లాడకపోవడం వల్లే వాణిజ్య ఒప్పందం కార్యరూపం దాల్చలేదని అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ చేసిన వ్యాఖ్యల్లో స్పష్టత లేదన్నారు రణధీర్. ఇప్పటికీ వాణిజ్య ఒప్పందం కోసం ఇండియా సిద్ధంగానే ఉందన్నారు.

Read also: కరీంనగర్ కు ‘‘ఆయుష్‘‘ మంజూరు
Follow Us On: Twitter


