కలం డెస్క్ : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండేండ్ల కాలంలో సీఎంఆర్ఎఫ్ (CMRF-ముఖ్యమంత్రి సహాయ నిధి) నుంచి లబ్ధిదారులకు రూ. 1,685.79 కోట్లు విడుదలైంది. దీని ద్వారా 3,76,373 మంది లబ్ధి పొందారు. ఇందులో 27,421 మంది లెటర్ ఆఫ్ క్రెడిట్ (LOC) ద్వారా రూ. 533.69 కోట్ల మేర సాయం అందుకోగా మిగలిన 3,48,952 మంది రూ. 1,152.10 కోట్ల మేర రీఇంబర్స్ మెంట్ రూపంలో సాయం అందుకున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సీఎంఆర్ఎఫ్ కింద ఎంత మందికి ఏ మేరకు సాయం అందిందనే వివరాలను అధికారులు విడుదల చేశారు.
గత ప్రభుత్వం 2018-23 మధ్యకాలంలో సుమారు రూ. 2,400 కోట్లను సీఎంఆర్ఎఫ్ (CMRF) కింద విడుదల చేసింది. సగటున ఏటా రూ. 480 కోట్ల మేర పంపిణీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఏటా సగటున రూ. 843 కోట్ల చొప్పున ఖర్చు చేసినట్లు అధికారులు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. వార్షిక బడ్జెట్‌లలో ప్రభుత్వం రూ. 200 కోట్ల చొప్పున గడచిన రెండేండ్లలో కేటాయింపులు చేసినా లబ్ధిదారుల పేదరిక, వైద్య అవసరాలను దృష్టిలో పెట్టుకుని దానికి నాలుగు రెట్ల మేర సీఎంఆర్ఎఫ్ నుంచి విడుదల చేసినట్లయింది. సాయం అందుకున్నవారిలో 316 మంది క్యాన్సర్ బాదితులు కాగా 196 మంది వినికిడి సమస్యతో బాధపడుతున్నవారు. ఎక్కువ సాయం హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 26,694 మందికి ఎల్ఓసీ అవసరాలకు ఇచ్చినట్లు అధికారులు వివరించారు.
Read Also: రూ.100 కోట్ల సైక్లింగ్ ట్రాక్‌పై పెద్ద కర్మలా!
Follow Us On: Youtube


