epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

ఉర్దూ వర్శిటీ భూములపై సర్కారు కన్ను

కలం డెస్క్ : గచ్చిబౌలిలోని సెంట్రల్ వర్శిటీ భూముల స్వాధీనం వివాదం సద్దుమణగకముందే రాష్ట్ర సర్కార్‌కు ఉర్దూ వర్శిటీ (Urdu University) తో చిక్కులు ఎదురయ్యాయి. గండిపేట్ మండలం మణికొండ జాగీర్ భూముల్లో ఉన్న మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్శిటీకి (MANUU) చెందిన 50 ఎకరాలను తిరిగి తీసుకోడానికి రాష్ట్ర సర్కార్ ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ భూమిని అప్పగించాల్సిందిగా వర్శిటీ (MANUU) రిజిస్ట్రార్‌కు గత నెల 15న లేఖ రాసింది. ఇవి నిరుపయోగంగా ఉన్నందున తిరిగి ప్రభుత్వానికి అప్పగించేయాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ లేఖ రాశారు. నిర్దిష్ట అవసరాలకు ఉపయోగించని కారణంగా వీటిని తిరిగి ప్రభుత్వం ఎందుకు స్వాధీనం చేసుకోకూడదో వివరణ ఇవ్వాలంటూ షోకాజ్ నోటీసులో పేర్కొన్నారు. రెండు నెలల గడువు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వానికి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఇష్తియాక్ అహ్మద్ జనవరి 1న రాసిన లేఖలో పేర్కొన్నారు.

27 ఏండ్లుగా వర్శిటీ ఆధీనంలో ల్యాండ్స్ :

ఉమ్మడి రాష్ట్రంలో మణికొండ (Manikonda Jagir) జాగీర్‌ పరిధిలోని (సర్వే నెం. 211, 212) 200 ఎకరాల భూముల్ని మౌలానా ఆజాద్ నేషనల్ యూనివర్శిటీకి అప్పగిస్తూ అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అప్పటివరకూ ‘హుడా’ (Hyderabad Urban Development Authority) ఆధీనంలో ఈ భూములను 1998 జూలై 23న వర్శిటీకి ‘హుడా’ అప్పగించింది. ఇందులో 150 ఎకరాల మేర భవనాలు, ఇతర అవసరాలకు యూనివర్శిటీ వాడుకుంటూ ఉన్నదని, మిగిలిన 50 ఎకరాలు నిరుపయోగంగానే ఉండిపోయాయని, ఇది ‘స్టేట్ లాండ్ రెవెన్యూ రూల్స్’లోని 6వ రూల్ ప్రకారం ఉల్లంఘనే అని గత నెల 15న రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రాసిన షోకాజ్ నోటీసులో పేర్కొన్నారు. దీన్ని నిర్దిష్ట అవసరాలకు వాడుకోకపోవడం వలన తిరిగి ప్రభుత్వం ఎందుకు స్వాధీనం చేసుకూడదో రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని కోరారు.

ఆ భూమిని ఇవ్వలేమన్న రిజిస్ట్రార్ :

రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రాసిన షోకాజ్ నోటీసుపై వర్శిటీ రిజిస్ట్రార్ ప్రొ. ఇష్తియాక్ అహ్మద్… ఆ భూముల్ని తిరిగి అప్పగించలేమని వివరణ ఇచ్చారు. ఖాళీగా ఉండిపోయిన 50 ఎకరాల్లో చేపట్టనున్న పనులకు సంబంధించిన ప్రణాళికను వివరించారు. అక్కడ యూనివర్శిటీకి అవసరమైన కొన్ని కొత్త భవనాలను నిర్మించాల్సి ఉన్నదని, అకడమిక్ బిల్డింగులతో పాటు హాస్టళ్ళను నిర్మించనున్నామని, సిబ్బందికి నివాస సౌకర్యాన్ని కూడా కల్పించనున్నామని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన డీపీఆర్ (Detailed Project Report) ప్రస్తుతం హైదరాబాద్ సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్టుమెంటు సిద్ధం చేస్తూ ఉన్నదని, త్వరలోనే ఆ కాపీ అందుతుందని వివరించారు. అది రాగానే కేంద్ర ప్రభుత్వానికి (హెచ్ఆర్‌డీ మంత్రిత్వశాఖ) సమర్పిస్తామని తెలిపారు. ఇందుకోసం రెండు నెలల గడువు ఇవ్వాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను కోరారు.

Urdu University
Urdu University

Read Also: ప్రభుత్వ లెక్కలన్నీ ఉత్తవే.. సర్కారుపై మండలి చైర్మన్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>