epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

ప్రభుత్వ లెక్కలన్నీ ఉత్తవే.. సర్కారుపై మండలి చైర్మన్

కలం డెస్క్ : “మంత్రులు, అధికారులు చెప్తున్న లెక్కలన్నీ ఉత్తవే.. లెక్కల్లో చాలా చూపిస్తున్నారు.. కానీ ఫీల్డ్ మీద చూస్తే పరిస్థితి భిన్నంగా ఉన్నది…” అని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender Reddy) వ్యాఖ్యానించారు. రాష్ట్ర విద్యాశాఖ పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏడాది నుంచి మొత్తుకుంటున్నా కదలిక లేదని తన స్వగ్రామంలోని ప్రభుత్వ పాఠశాల పరిస్థితిని వివరించారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సహా ఆ శాఖ అధికారులకు చెప్పినా, లెటర్లు రాసినా ఇప్పటివరకు ప్రోగ్రెస్ లేదని వాపోయారు. గత ప్రభుత్వం మొదలుపెట్టిన ‘మన ఊరు – మన బడి’ పథకానికి రూ. 360 కోట్లు మంజూరయ్యాయని, ఆ మేరకు పనులు చేశారని, కానీ ఆ పనులు చేసిన వర్క్ ఏజెన్సీలకు మాత్రం బిల్లుల పేమెంట్ పెండింగ్‌లో ఉన్నదని, వెంటనే చెల్లించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

సౌకర్యాలు లేకనే డ్రాప్ ఔట్‌లు :

ప్రభుత్వ స్కూళ్ళలో మౌలిక సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారని, అందుకే కొత్త అడ్మిషన్లు ఆశించిన స్థాయిలో జరగకపోగా డ్రాప్ ఔట్‌లు కూడా పెరుగుతున్నాయన్నారు. ఉదాహరణకు 2024-25 విద్య సంవత్సరంలో ప్రభుత్వం 18.5 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్ళలో ఉంటే 36 లక్షల మంది ప్రైవేటు స్కూళ్ళలో ఉన్నారని గుర్తుచేశారు. ఈ సంవత్సరం సుమారు 3 లక్షల మంది కొత్తగా చేరినట్లు అధికారులు లెక్కలు చెప్తున్నా 30 వేల మంది కూడా చేరలేదన్నారు. పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో అరకొర పనులు అక్కడే ఆగిపోయాయని, తన స్వగ్రామంలో పిల్లలుల రోజూ చెట్ల కింద కూర్చుంటున్నారని గుర్తుచేశారు. చలికాలంలో వారు ఎలా ఉండగలరని Gutha Sukender Reddy ప్రశ్నించారు.

ఏడాది కింద చెప్పినా ఫలితం లేదు :

సర్కారు స్కూల్‌లోని పరిస్థితులపై విద్యాశాఖ ప్రినిస్పల్ సెక్రటరీకి లెటర్ రాశానని, చివరకు ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి చెప్పినా పనులు పూర్తికాలేదని మండలి చైర్మన్ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ‘అమ్మ ఆదర్శ పాఠశాల’ స్కీమ్ తెచ్చినా దాన్ని ‘మైనింగ్ సెస్‌’కు అటాచ్ చేశారని, ఆ సెస్‌తో ఆదాయం సమకూరే దగ్గర మాత్రమే నిధులు విడుదల అవుతున్నాయని, కొన్ని చోట్ల ఆ ఫండ్స్ కూడా ఆగిపోయాయన్నారు. ‘మన ఊరు – మన బడి’ స్కీమ్ కింద పనులు చేసిన చిన్నచిన్నకాంట్రాక్టర్లకు పేమెంట్స్ చెల్లించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పనులు మొదలుపెట్టిన కాంట్రాక్టర్లు అప్పులు తెచ్చి పనులు చేసారని, తన సొంత ఊరిలోని స్కూల్‌కే సుమారు రూ. 19 లక్షలు బాకీ ఉన్నదన్నారు. ఆ కాంట్రాక్టరు బాధ చూడలేక తానే రూ. 5 లక్షలు ఇచ్చానని, బిల్లు పేమెంట్ రాగానే తిరిగి ఇస్తే చాలు అని ఆ కాంట్రాక్టర్‌కు చేసిన సాయాన్ని గుర్తుచేశారు. ఇలాంటి పరిస్థితులు చాలాచోట్ల ఉన్నాయన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>