కలం డెస్క్ : University Teaching Posts | రాష్ట్రవ్యాప్తంగా వివిధ విశ్వవిద్యాలయాల్లోని ఖాళీ టీచింగ్ పోస్టుల భర్తీకి కసరత్తు మొదలైంది. ఉస్మానియా (Osmania), కాకతీయ (Kakatiya), తెలంగాణ (Telangana Varsity), శాతవాహన (Satavahana) వర్శిటీ, మహాత్మాగాంధీ వర్శిటీ (Mahatma Gandhi), పాలమూరు వర్శిటీ (Palamuru University), డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ (Dr. Ambedkar Open University), జేఎన్‌టీయూ (JNTU), జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాయలయం, డాక్టర్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం తదితర యూనివర్శిటీల్లోని అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల్ని భర్తీ చేయాలని ప్రభుత్వం సంకల్పించి ప్రాథమిక కసరత్తు మొదలుపెట్టింది. మొత్తం 465 పోస్టులు భర్తీ కానున్నట్లు అంచనా.
రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీకి నోటిఫికేషన్ :
University Teaching Posts | ప్రస్తుతం పలు విశ్వవిద్యాలయాల్లో, వాటికి అనుబంధంగా ఉన్న ప్రభుత్వ కాలేజీల్లో గెస్ట్ ప్రొఫెసర్లు, విజిటింగ్ ప్రొఫెసర్లు, కాంట్రాక్టు పద్ధతి.. ఇలా వివిధ రూపాల్లో కొందరు పనిచేస్తున్నారు. వీటి స్థానంలో రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. మొత్తం పోస్టుల్లో దాదాపు సగానికి పైగా ఒక్క ఉస్మానియా విశ్వవిద్యాలయంలోనే భర్తీ కానున్నట్లు సచివాలయ వర్గాల సమాచారం. ఈ నియామకానికి సంబంధించి వేతనాలు తదితరాలను ప్రభుత్వమే ఇవ్వాల్సి ఉన్నందున ఆర్థిక శాఖ అనుమతి (Approval) కోరుతూ ఫైల్ సంబంధిత అధికారులకు వెళ్ళింది. జిల్లాల్లోని యూనివర్శిటీలకు అనుబంధంగా ఉన్న సైన్స్, ఆర్ట్స్, ఇంజినీరింగ్ కళాశాలల్లోనూ కొన్ని ఖాళీలు ఉన్నందున వాటిని సైతం ప్రభుత్వం భర్తీ చేయనున్నది. ఆయా యూనివర్శిటీలవారీగా ఎన్ని అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయో లెక్కలు తెప్పించిన తర్వాత వాటిని క్రోడీకరించి ఆర్థిక శాఖ సమ్మతి కోసం ప్రభుత్వం ఫైల్‌ను పంపింది.
ఎగ్జిక్యూటివ్ కౌన్సిళ్ళ ఏర్పాటు :
అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల్ని భర్తీ చేయడానికి ముందే అన్ని యూనివర్శిటీలకు ఎగ్జిక్యూటిక్ కౌన్సిళ్ళను ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నది. ఆయా వర్శిటీల వైస్ చాన్సెలర్లు (Vice Chancellor) ఈ కౌన్సిళ్ళకు చైర్‌పర్సన్లుగా వ్యవహరిస్తారు. మొత్తం తొమ్మిది యూనివర్శిటీలకూ వీటి నియామకానికి సంబంధించి వారం రోజుల్లో నోటిఫికేషన్ వెలువడనున్నది. ఉస్మానియా, కాకతీయ, మహాత్మాగాంధీ, పాలమూరు, శాతవాహన యూనివర్శిటీ, జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్-ఫైన్ ఆర్ట్సీ వర్శిటీలకు తొమ్మిది మంది చొప్పున కౌన్సిల్‌లో ప్రొఫెసర్లు, విద్యావేత్తలు మొత్తం తొమ్మిది మంది ఉంటారు. చైర్‌పర్సన్‌గా వ్యవహరించే వైస్ ఛాన్సెలర్లు ఈ తొమ్మిదిమందికి అదనం. సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్శిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌కు ఏడుగురు, డాక్టర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీకి ఆరుగురు చొప్పున కౌన్సిల్‌లో ఉంటారు.
కౌన్సిల్‌లో ఎవరెవరుంటారు?
విశ్వవిద్యాలయాల ఎగ్జిక్యూటివ్ కౌన్సిళ్ళలో ఎవరెవరు ఉంటారు, ఎవరు నియమిస్తారనే అంశంలో 1991 నాటి యూనివర్శిటీ యాక్టులోని నిబంధనల ప్రకారం ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. యూనివర్శిటీ కాలేజీ తరఫున ఒక సీనియర్ ప్రొఫెసర్, ఆ కాలేజీలకు చెందిన ప్రిన్సిపాళ్లలో ఒకరు, కాలేజీలకు చెందిన ఒక లెక్చరర్/ప్రొఫెసర్, అనుబంధ కళాశాలల నుంచి ఒక ప్రిన్సిపాల్, అనుబంధ కళాశాలల నుంచి ఒక లెక్చరర్/ప్రొఫెసర్‌తో పాటు ఇండస్ట్రీ/అగ్రికల్చర్/ట్రేడ్/కామర్స్/ఎడ్యుకేషన్/పబ్లిక్ లైఫ్/లీగల్ ప్రొఫెషన్/సోషల్ వర్క్ తదితర రంగాల నుంచి ఒకరి చొప్పున ప్రభుత్వం నామినేట్ చేస్తుంది. ఈ కౌన్సిల్ సమావేశాలకు కోరంగా హాజరైన మొత్తం సభ్యుల్లో (ప్రభుత్వం ఆరుగురిని మాత్రమే కౌన్సిల్‌గా పరిగణిస్తుంది) మూడవ వంతు మందిని ఖరారు చేసింది. అంటే, కనీసంగా ఆరుగురు సభ్యులు సమావేశానికి తప్పనిసరిగా హాజరు కావాల్సి ఉంటుంది. కౌన్సిళ్ళ ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ అయిన తర్వాత ఒకసారి సమావేశమై చర్చలు జరిగిన తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ కానున్నది.
Read Also: రోజుకు 8 గంటలు ఎలా నిద్రపోవాలి? వరుసగానా.. 4-4 గంటల చొప్పునా..?
Follow Us On: Instagram


