కలం డెస్క్ : ప్రభుత్వ కార్యాలయాలు, హెచ్ఓడీలలో ప్రైవేట్ మెయిల్స్ (Private Emails) వాడకంపై రాష్ట్ర సర్కార్ నిషేధం విధించింది. అధికారిక సమాచార అవసరాల (Official Correspondence) కోసం తప్పనిసరిగా ఎన్ఐసీ (NIC) మెయిల్ అకౌంట్లను మాత్రమే వాడాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రభుత్వ అంతర్గత సమాచారాన్ని పంపడం, తెప్పించుకునే అవసరాలకు ఇది మాండేటరీ అని రాష్ట్ర ఐటీ కమ్యూనికేషన్ల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వం తరఫున ప్రభుత్వేతర వ్యక్తులు లేదా సంస్థలకు మెయిల్ ద్వారా పంపే సమాచారానికి కూడా ఈ నిబంధన వర్తిస్తుందని పేర్కొన్నారు. థర్డ్ పార్టీ డొమెయిన్‌ల ద్వారా నిర్వహించే ఈ-మెయిల్ ఖాతాలను అధికారిక అవసరాలకు వాడకూడదని స్పెషల్ సీఎస్ సంజయ్ కుమార్ ఆ సర్క్యులర్‌లో నొక్కిచెప్పారు. తక్షణం ఇది అమల్లోకి రావాలని స్పష్టం చేశారు.
ఎన్ఐసీ మెయిల్ అకౌంట్లను ఓపెన్ చేయాలి :
ఇంతకాలం ప్రైవేట్ మెయిల్స్ (Private Emails) ద్వారా సమాచారం పంపే ఆనవాయితీ కొనసాగుతున్నదని ఆ సర్క్యులర్‌లో గుర్తుచేసిన ఆయన ఇక నుంచి ఎన్ఐసీ (@telangana.gov.in) మెయిల్స్ ను వినియోగించాలన్నారు. అందుకోసం సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ మెయిల్ సెక్షన్ కోఆర్డినేటర్‌తో సంప్రదింపులు జరిపి కొత్త ఈ-మెయిల్ ఖాతాలను ఓపెన్ చేయించుకోవాలని సూచించారు. ప్రతీ డిపార్టుమెంట్ హెడ్ చొరవ తీసుకుని వారి కింద ఎవరెవరికి కొత్త ఈ-మెయిల్ అకౌంట్లు అవసరమో జాబితాను పంపి కోఆర్డినేట్ చేసుకోవాలన్నారు. అన్ని శాఖల స్పెషల్ చీఫ్ సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, స్పెషల్ సెక్రటరీలు, సెక్రటరీలు, కమిషనర్లు, డైరెక్టర్లు, డైరెక్టర్ జనరల్స్… ఇలాంటి స్థాయి అధికారులు ఈ సర్క్యులర్‌లోని నిబంధనలను పకడ్బందీగా అమలు చేస్తూ వారి కింది సిబ్బంది కూడా అమలుచేసేలా పర్యవేక్షించాలన్నారు.
లీకేజీలను అరికట్టే ముందస్తు చర్యలు :
కేంద్ర ప్రభుత్వంలోని ఎలక్ట్రానిక్స్-ఐటీ మంత్రిత్వశాఖ (MeITY) ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ కొత్త నిబంధనను అమలులోకి తీసుకొచ్చినట్లు సంజయ్ కుమార్ తెలిపారు. సైబర్ సెక్యూరిటీ సమస్యతో పాటు అధికారిక సమాచారం దుర్వినియోగం కాకుండా ఈ విధానానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్ర క్యాబినెట్ గత నెల 20న ఖరారు చేసిన హిల్ట్ (HILT) పాలసీ అధికారికంగా జీవో (GO) రూపంలో విడుదల కావడానికి ముందే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) చేతికి చిక్కింది. వెంటనే అందులోని వివరాలను ఉటంకిస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఈ వ్యవహారం జరడానికి రెండు వారాల ముందే (నవంబరు 11న) సంజయ్ కుమార్ ఈ సర్క్యులర్‌ను జారీచేశారు. ఇకపైన ఏ మేరకు లీకేజీలు (Leakage) కట్టడి అవుతాయో వేచి చూడాలి.

Read Also: BMW-TVS 450cc బైక్ చూసి గర్వించిన రాహుల్.. ఇండియన్ ఇంజినీరింగ్‌కు ప్రశంసలు
Follow Us On: Pinterest


