కలం డెస్క్ : రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులు (IAS Officers) నేడో రేపో బదిలీ కానున్నారు. ఎక్కువగా లాంగ్ స్టాండింగ్ (Long Standing) ఆఫీసర్లు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ (Special Chief Secretaries), ప్రిన్సిపల్ సెక్రటరీలు (Principal Secretaries) స్థాన చలనం కలిగే అవకాశమున్నది. దాదాపు పాతిక మందికి ట్రాన్స్ ఫర్ తప్పదని సచివాలయ (Secretariat) వర్గాల సమాచారం. గ్రామీణ స్థానిక సంస్థల (Local Bodies) ఎన్నికల ప్రక్రియ ముగియడం, దానితో పాటే ఎలక్షన్ కోడ్ కూడా కంప్లీట్ అవుతుండడంతో ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశమున్నది. పలువురు ఐపీఎస్ (IPS) అధికారులను ఇటీవలే బదిలీ చేసిన ప్రభుత్వం దానికి కొనసాగింపుగా ఐఏఎస్ ఆఫీసర్లను కూడా మార్చాలనుకున్నది. కానీ స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఆ ప్రక్రియకు బ్రేక్ పడింది.
రానున్న రెండున్నరేళ్ళే టార్గెట్‌గా.. :
రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లు పూర్తయినందు మరో రెండున్నరేళ్ళ కాలాన్ని పరిగణనలోకి తీసుకుని ఐఏఎస్ అధికారులకు(IAS Officers) కొత్త బాధ్యతలు దక్కనున్నాయి. ఎలాగూ చివరి ఆరు నెలలు ఎన్నికల హడావిడిలో కలిసపోతుంది. దీంతో రెండున్నరేళ్ళలో ప్రభుత్వం ఏయే పథకాలను కీలకంగా చేపట్టనున్నదో ఆయా శాఖలకు సీనియర్, సిన్సియర్ అధికారులను నియమించనున్నట్లు సెక్రటేరియట్ వర్గాలు వివరించాయి. సమర్ధులైన అధికారులకు కీలక శాఖలు దక్కనున్నాయి. ఆయా శాఖల పరిధిలోని కొన్ని హెచ్ఓడీలకు సైతం కొత్త అధికారులు రానున్నారు. ఇప్పటివరకూ దీర్ఘకాలంగా ఒకే శాఖలో ఉంటున్న అధికారులను ప్రభుత్వం మరో చోటికి మార్చాలనుకుంటున్నది. బదిలీకి వెళ్ళేవారిలో దాదాపు డజను మంది జిల్లాల కలెక్టర్లు, ఆరేడుగురు స్పెషల్ చీఫ్ సెక్రటరీలు, కొందరు ప్రిన్సిపల్ సెక్రటరీలు ఉన్నట్లు సమాచారం.
ఇదే చివరి బదిలీ అవుతుందేమో.. :
త్వరలో ఐఏఎస్ అధికారులను బదిలీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నందున ఇదే చివరి మేజర్ ట్రాన్స్ ఫర్‌గా ఉండాలనుకుంటున్నది. ఇకపైన తప్పనిసరి అయితే మాత్రమే బదిలీ చేయాలని, లేనిపక్షంలో వారిని అదే స్థానాల్లో ఉంచాలని భావిస్తున్నది. ఎలాగూ ఎన్నికల నాటికి ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులు వస్తాయని, బదిలీలు తప్పవని, అందువల్ల కనీసంగా రెండున్నరేళ్ళ పాటు కదలకుండా వారికి కేటాయించిన శాఖల్లోని స్కీమ్‌లు, పనులపైనే దృష్టి సారించేలా చూడాలని అనుకుంటున్నది. రాబోయే కాలాన్ని దృష్టిలో పెట్టుకుని సంక్షేమ పథకాల అమలును పరిగణనలోకి తీసుకుని ఎక్కడ ఎవరిని నియమిస్తే బాగుంటుందో ఇప్పటికే ప్రభుత్వం కసరత్తు పూర్తిచేసింది. అప్రాధాన్య శాఖల్లో ఉన్న కొందరికి ఇకపైన కీలక బాధ్యతలు రావచ్చని సమాచారం.
Read Also: ప్రైవేట్ ఈ-మెయిల్స్ వాడకంపై నిషేధం
Follow Us On : WhatsApp


