కలం, ఖమ్మం బ్యూరో: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని నిరుద్యోగ మహిళలకు తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అందించింది. జిల్లాలో సుదీర్ఘకాలంగా ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల (ఆయా) పోస్టుల (Anganwadi Posts) భర్తీకి ఎట్టకేలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ వారం చివరినాటికి అంగన్‌వాడీ సిబ్బందికి సంబంధించిన అంతర్గత బదిలీల ప్రక్రియను అధికారులు పూర్తిగా ముగించనున్నారు. ఈ బదిలీల ప్రక్రియ పూర్తయిన వెంటనే, వచ్చే జూన్ 1వ తేదీన ఖాళీల భర్తీకి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసేందుకు అధికారులు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు ఉమ్మడి జిల్లా పరిధిలో విస్తృతంగా సర్వే చేసి ఖాళీల వివరాలను సేకరించారు. దీని ప్రకారం ఖమ్మం జిల్లాలోని 7 ప్రాజెక్టుల పరిధిలో 107 అంగన్‌వాడీ టీచర్ పోస్టులు, 597 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించారు. అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 11 ప్రాజెక్టుల పరిధిలో 192 అంగన్‌వాడీ టీచర్ పోస్టులతో పాటు భారీగా 1011 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. రెండు జిల్లాల పరిధిలో కలిపి మొత్తం 299 టీచర్ పోస్టులు, 1608 ఆయా పోస్టులు ఖాళీగా ఉండటంతో, మొత్తం 1,907 పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ ద్వారా మార్గం సుగమం కానుంది.
నిబంధనల ప్రకారం మొదట బదిలీల ప్రక్రియను ముగించి, ఆ తర్వాతే తుది ఖాళీల జాబితాతో జూన్ ఒకటో తేదీన నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఈ పోస్టుల ఎంపిక ప్రక్రియలో ఎలాంటి రాత పరీక్షలు ఉండవని, కేవలం అభ్యర్థుల విద్యార్హత మార్కులు, వయోపరిమితితో పాటు స్థానికత ఆధారంగానే ఎంపిక జరుగుతుందని తెలుస్తోంది. ఏజెన్సీ, గ్రామీణ ప్రాంతాల్లోని వందలాది మంది నిరుద్యోగ మహిళలకు సొంత ఊర్లోనే ఉపాధి పొందేందుకు ఈ నోటిఫికేషన్ ఒక సువర్ణావకాశంగా మారనుంది.

