కలం, జోగులాంబ గద్వాల: కేటిదొడ్డి మండల ఎంపీడీఓ కార్యాలయానికి భవన యజమాని తాళం వేశారు. 2017లో నూతన మండలం ఏర్పాటులో భాగంగా కేటిదొడ్డి(Ketedoddi) మండలాన్ని ఏర్పాటు చేశారు. నూతన మండలంలో ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు లేక అద్దె భవనంలో కొనసాగుతోంది. ఇందులో భాగంగా మండల కేంద్రానికి చెందిన పెద్ద తాయప్పకు సంబంధించిన భవనంలో ఎంపీడీఓ కార్యాలయాన్ని కొనసాగిస్తున్నారు. నెలకు రూ.10,500 చొప్పున అద్దె చెల్లిస్తున్నారు. అయితే మూడేండ్ల నుంచి భవనానికి అద్దె చెల్లించకపోవడంతో యజమాని ఈ చర్యకు దిగినట్లు తెలిసింది.
సోమవారం మండల ప్రజావాణి నిర్వహిస్తున్న క్రమంలో భవన యజమాని తాళం వేసి నిరసన చేపట్టారు. దీంతో అక్కడి చేరుకున్న ఎమ్మార్వో కరుణాకర్, ఎంపీఓ రామన్ గౌడ్, ఎంపీడీఓ రమణరావు భవన యజమానితో మాట్లాడి అద్దె చెల్లించేలా చర్యలు తీసుకుంటామన్నారు. అయితే కేటిదొడ్డి మండలంలో ప్రభుత్వ కార్యాలయానికి తాళం పడటంతో స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అద్దె బకాయిల చెల్లింపులో జాప్యంపై అధికారుల నిర్లక్ష్యం ఏ మేరకు ఉందోనని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అయితే పోలీస్ స్టేషన్, మండల మహిళ సమాఖ్య భవనం, మరికొన్ని కార్యాలయాలు కూడా అద్దె భవనంలో నిర్వహిస్తున్నారని, సొంత భవనాలు నిర్మించాలని మండల అధికారులు కోరారు.

