Mobile Popup Ad
Mobile Popup Ad

మేడిగడ్డ ఫైల్స్ దగ్ధం.. ప్రమాదమేనా??

కలం, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో వివాదాస్పదంగా మారిన మేడిగడ్డ (Medigadda) బ్యారేజీకి సంబంధించిన కీలక పత్రాలు అగ్నికి ఆహుతైన ఘటన సంచలనం రేపుతోంది. ఆదివారం మేడిగడ్డ బ్యారేజీ సమీపంలోని అంబట్‌పల్లిలో ఉన్న ఎల్ అండ్ టీ క్యాంప్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో బ్యారేజీకి సంబంధించిన ఒరిజినల్ డిజైన్‌లు, ప్రభుత్వ ఒప్పంద పత్రాలు, వ్యయ ప్రణాళికలు, మెయింటెనెన్స్ రికార్డులు సహా అనేక కీలక ఫైళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. బ్యారేజీ నిర్మాణం, నిర్వహణ బాధ్యతలు ఎల్ అండ్ టీ(L&T) సంస్థదే కావడంతో ఈ ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోవడం, నిర్మాణ లోపాలపై జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక ఇవ్వడం, జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించడం వంటి పరిణామాల మధ్య ఈ అగ్నిప్రమాదం చోటుచేసుకోవడం చర్చనీయాంశమైంది.

స్థానికుల సమాచారం ప్రకారం సమీప పంట పొలాల్లో రైతులు వరి అవశేషాలకు నిప్పు పెట్టడంతో వచ్చిన నిప్పురవ్వల వల్ల మంటలు వ్యాపించి ఉండొచ్చని ఒక వాదన వినిపిస్తోంది. మరోవైపు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణమై ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. అయితే పోలీసులు ఇంకా ఖచ్చితమైన కారణాన్ని నిర్ధారించలేదు. ఈ క్యాంప్ కార్యాలయంలో తాత్కాలిక ఆఫీస్, సిబ్బంది నివాస గదులు, గెస్ట్ హౌస్ కూడా ఉన్నాయి. ప్రమాదంలో మొత్తం ఏడు గదులు పూర్తిగా కాలిపోయాయి. కార్యాలయంలోని కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, హార్డ్ డిస్కులు, ఫర్నిచర్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు బూడిదయ్యాయి. మంటలు చెలరేగిన తర్వాత ఫైర్ ఇంజిన్లు ఆలస్యంగా చేరుకోవడంతో నష్టం మరింత పెరిగినట్లు సమాచారం.ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా? లేక కీలక ఆధారాలను నాశనం చేయాలనే ఉద్దేశంతో జరిగిందా? అన్న ప్రశ్నలు ఇప్పుడు చర్చకు దారితీస్తున్నాయి. పోలీసులు కుట్ర కోణాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఇదే తరహాలో గతంలో ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన కొన్ని కీలక పత్రాలు హైదరాబాద్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో దగ్ధమైన ఘటనను రాజకీయ వర్గాలు గుర్తుచేస్తున్నాయి. అప్పట్లో కూడా షార్ట్ సర్క్యూట్ కారణమని అధికారులు ప్రకటించినప్పటికీ అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు మేడిగడ్డ ఘటన కూడా అలాంటి సందేహాలకే కారణమవుతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>