కలం, వెబ్‌డెస్క్: ఎలాంటి బంధానికైనా నమ్మకం అనేది అత్యంత బలమైన పునాది. అది లేకపోతే ఎంత ప్రేమ ఉన్నా ఆ బంధం ఎక్కువ కాలం నిలబడలేదు. ఒక రిలేషన్‌షిప్ (Relationship) లో ఆ నమ్మకాన్ని మరింత పెంచుకోవడానికి కొన్ని ముఖ్యమైన విషయాలు చెబుతున్నారు నిపుణులు. వాటిలో ముఖ్యమైంది నిజాలు మాట్లాడటం.
కొంతమంది ఎప్పుడూ అబద్ధాలు చెబుతూ ఉంటారు. తప్పని పరిస్థితుల్లో ఎప్పుడో ఒకసారి అబద్ధం చెప్తే అర్ధం చేసుకోవచ్చు.. అంతేకానీ.. ప్రతిరోజూ ప్రతి సందర్భంలో అసలు విషయం దాచి అబద్ధాలు చెబుతుంటే మాత్రం ఎక్కడో ఒక చోట దొరికిపోవడం ఖాయం. దీనివల్ల ఎదుటి వ్యక్తిపై ఉండే నమ్మకం మసక బారుతుందని సూచిస్తున్నారు నిపుణులు. ఇలా పదే పదే అబద్ధాలు చెప్పడం వలన నమ్మకం పోవడమే కాదు అనుబంధాల్లో కలతలు రేగడానికి కారణమవుతుందంటున్నారు నిపుణులు. అందుకే భార్యాభర్తలు ఏ విషయంలోనైనా సరే పారదర్శకంగా వ్యవహరించాలని చెబుతున్నారు.
మాజీ జ్ఞాపకాల గురించి..
ప్రతిఒక్కరి జీవితంలో విఫలమైన ప్రేమకథలు, బ్రేకప్‌లు ఉంటాయి. వేరొకరితో పెళ్లెనా ఏదో ఒక సందర్భంలో ‘మాజీ’ గుర్తుకు రావడం, వాళ్ల ఆలోచనలు మనసును ఉక్కిరి బిక్కిరి చేయడంతో మూడ్ మారిపోతుంటుంది. అయితే ఆ అసహనాన్ని భాగస్వామిపై చూపించడం కరెక్ట్ కాదంటున్నారు నిపుణులు. వారి గురించి పదే పదే ప్రస్తావించడం, మనసు నిండా ‘మాజీ’ ఆలోచనలే పెట్టుకొని.. బయటికి మాత్రం తను జస్ట్ ఫ్రెండ్.. అంతే! అంటూ అబద్దం చెప్పడం.. ఇవన్నీ భాగస్వామికి లేనిపోని అనుమానాలు కలిగేలా చేస్తాయట. తద్వారా ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు తలెత్తుతాయి. అందుకే ఇలాంటి అంశాల్లో సాధ్యమైనంతవరకు పారదర్శకంగా ఉండడం దంపతుల మధ్య అనుబంధాన్ని మరింత దృఢం చేస్తుందంటున్నారు నిపుణులు.
డబ్బు విషయంలో నిజాయితీ
భార్యాభర్తలు ఇద్దరు తమ ఆదాయం, ఖర్చుల విషయంలో నిజాయితీ పాటించాలని సూచిస్తున్నారు. ఆలుమగల మధ్య అనుబంధాన్ని దెబ్బతీసే అంశాల్లో ఆర్థిక విషయాలూ ముందు వరుసలో నిలుస్తాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా.. ఒకరి ఆదాయ వ్యయాల గురించి మరొకరి దగ్గర దాచడం, విచ్చల విడిగా ఖర్చు చేస్తూ.. వ్యయాల విషయంలో పరిమితంగానే ఉన్నానని కవర్ చేసుకోవడం.. ఇలా ముందొకలా, వెనక మరోలా వ్యవహరిస్తుంటే.. ఎప్పుడో ఒకసారి దొరికిపోయే అవకాశం ఉంటుంది. తద్వారా భాగస్వామి నమ్మకం కోల్పోయి క్రమంగా అనుబంధం సన్నగిల్లే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఆదాయం, ఖర్చులు, పొదుపు, పెట్టుబడులు.. ఇలా ప్రతి విషయంలోనూ పారదర్శకత అవసరం అంటున్నారు నిపుణులు.
నమ్మకం పెరగాలంటే..
కొన్నిసార్లు మనం జీవిత భాగస్వామిని సంతోషంగా ఉంచేందుకు అబద్ధాలు చెబుతుంటాం. ఒక్కోసారి వృత్తి ఉద్యోగాలకు సంబంధించి చెప్పే అబద్ధాలు కూడా అనుబంధాలు బీటలు వారేలా చేస్తాయంటున్నారు నిపుణులు. కాబట్టి ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. మొత్తం మీద దాంపత్య బంధంలో ఏ విషయంలోనూ దాపరికం, అబద్ధాలు చెప్పుకోవడం మంచిది కాదంటున్నారు నిపుణులు. ఎటువంటి విషయమైనా నిజాలు మాట్లాడుతూ పారదర్శకంగా ఉంటే తద్వారా ఇద్దరికీ ఒకరంటే ఒకరికి నమ్మకం పెరిగి అనుబంధమూ దృఢమవుతుందని చెబుతున్నారు నిపుణులు.

