కలం, వెబ్ డెస్క్: ఫెయిర్ నెస్ క్రీమ్ ను వాడడం ద్వారా తనకు కిడ్నీ వ్యాధి వచ్చినట్లు మలయాళ గాయకుడు సలీం కోడత్తూర్ (Saleem Kodathoor) తెలిపారు. స్నేహితుడి ద్వారా ఆ క్రీమ్ ను కొనుగోలు చేసి ఉపయోగించినట్లు వెల్లడించారు. అయితే, కొద్ది రోజుల్లోనే ఆరోగ్య సమస్యలు మొదలయ్యాయని, చివరికి మెంబ్రేనస్ నెఫ్రోపతీ అనే తీవ్రమైన కిడ్నీ వ్యాధికి దారితీసిందని సోషల్ మీడియాలో విడుదల చేసిన వీడియోలో సలీం ఆవేదన వ్యక్తం చేశారు.
ఎనిమిది నెలల చికిత్స తీసుకున్న తరువాత వ్యాధి నయమైనట్లు గాయకుడు ( Saleem Kodathoor) తెలిపారు. అయినా, తాను ఇప్పటికీ తీవ్రమైన అలసటతో బాధపడుతున్నట్లు చెప్పారు. ఫెయిర్ నెస్ క్రీమ్ ఉపయోగించడం వల్ల ఆరోగ్యంతో పాటు ఆర్థికంగా నష్టపోయినట్లు సలీం కోడత్తూర్ వెల్లడించారు.
తాను ఆ క్రీమ్‌ను వాడిన వారంలో రోజుల్లోనే తెల్లగా మారినట్లు చెప్పారు. నెలన్నర తరువాత యూరిన్ ఇన్ ఫెక్షన్ వచ్చినట్లు గుర్తు చేశారు. ఆస్పత్రిలో అడ్మిట్ అయి చికిత్స తీసుకోవడంతో ఇన్ ఫెక్షన్ తగ్గినా మళ్లీ అది తిరగబడిందని తెలిపారు. అనంతరం టెస్టుల్లో తనకు మెంబ్రేనస్ నెఫ్రోపతీ కిడ్నీ వ్యాధి సోకినట్లు తెలిసిందన్నారు.

