రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన మొంథా తుపాను(Montha Cyclone)కు గురైన బాధిత కుటుంబాలకు తెలంగాణ(Telangana) ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. తుపాను ప్రభావంతో దెబ్బతిన్న ఇండ్ల మరమ్మతులకు రూ.12.99 కోట్ల ఆర్థిక సాయం మంజూరు చేసింది. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 15 జిల్లాల్లో 8,662 ఇళ్లకు రూ.15,000 చొప్పున ఆర్థిక సహాయం అందించనుంది. బాధితుల ఖాతాల్లో నేరుగా ఈ మొత్తాన్ని జమ చేయాలని అధికారులను ఆదేశించారు. తుపాను దెబ్బతిన్న ప్రాంతాల్లో పరిస్థితులు సాధారణ స్థితికి రావడంపై ప్రభుత్వం సమీక్షలు నిర్వహిస్తోంది. జిల్లాల కలెక్టర్ల నుంచి అందిన నివేదికల ఆధారంగా నష్టాన్ని అంచనా వేసిన ప్రభుత్వం, దెబ్బతిన్న ఇళ్లు, పంటలు, రహదారులు, విద్యుత్ సదుపాయాల పునరుద్ధరణకు చర్యలు వేగవంతం చేసింది.
మొంథా తుపాను ప్రభావంతో తెలంగాణ(Telangana) వ్యాప్తంగా భీకర వర్షాలు కురవడంతో 16 మంది ప్రాణాలు కోల్పోయారు, వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండగా, ప్రభుత్వ యంత్రాంగం తక్షణ సహాయక చర్యలు ప్రారంభించింది. రహదారుల పరిస్థితి దారుణంగా మారింది. ఆర్‌అండ్‌బీ శాఖ వివరాల ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా 14 జిల్లాల్లో తుపాను తీవ్ర ప్రభావం చూపింది. మొత్తం 334 ప్రాంతాల్లో 230.41 కిలోమీటర్ల రహదారులు దెబ్బతిన్నాయి. 201 రహదారులపై నీరు పొంగి పోర్లగా, 8 రహదారులు పగుళ్లతో ప్రమాదకర స్థితికి చేరాయి. 156 ప్రాంతాల్లో రాకపోకలు పూర్తిగా ఆగిపోయాయి. పలుచోట్ల అధికారులు అత్యవసరంగా పనులు చేపట్టి రవాణా పునరుద్ధరించారు. అదనంగా, 61 చోట్ల కల్వర్టులు ధ్వంసమయ్యాయి.
విద్యుత్ శాఖ సిబ్బంది విద్యుత్ సరఫరా పునరుద్ధరణ చేపడుతోంది. రైతులకు సాయం అందించడంలో భాగంగా వ్యవసాయ శాఖ పంటల నష్టపరిహారం అంచనాలను సేకరిస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించి, “బాధితుల పట్ల ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుంది. ఒక్క కుటుంబమూ నిరాశలో ఉండకుండా సహాయం అందించాలి” అని ఆదేశించారు. తుపాను ప్రభావం తీవ్రంగా ఉన్న జిల్లాలకు అదనపు నిధులు మంజూరు చేసే అవకాశమున్నట్లు సమాచారం.
Read Also: ఢిల్లీలో GRAP-3 నిబంధనలు.. ఇదే తొలిసారి
Follow Us on : Pinterest

