ఏప్రిల్ 27 తర్వాతే పూర్తిస్థాయి డీజీపీ ఎంపిక.. ఎందుకంటే?

కలం, తెలంగాణ బ్యూరో : Telangana DGP | పూర్తిస్థాయి డీజీపీ నియామకంపై ప్రభుత్వం ఈ నెల 27 తర్వాతనే నిర్ణయం తీసుకోనున్నది. ఎలాగూ ఈ నెల 30 వరకూ శివధర్‌రెడ్డి కొనసాగనున్నందున ఒకటి రెండు రోజుల ముందే ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వాలనుకుంటున్నది. యూపీఎస్సీ ఫైనల్ చేసిన జాబితాలో ముగ్గురు అధికారుల పేర్లు ఉన్నందున వారిలో ఒకరిని ప్రభుత్వం తన ఆలోచన ప్రకారం ఎంపిక చేయనున్నది. ప్రస్తుతం తాత్కాలిక డీజీపీగా కొనసాగుతున్న శివధర్‌రెడ్డి నియామకంగా గతంలో దాఖలైన పిటిషన్ విచారణ ఈ నెల 27న హైకోర్టులో జరగనున్నది. ఆ రోజున ప్రభుత్వం అఫిడవిట్ రూపంలో క్లారిటీ ఇవ్వనున్నది. ఈ నెల 14న జరిగిన విచారణ సందర్భంగా ప్రభుత్వం వెలిబుచ్చిన అభిప్రాయం మేరకు తదుపరి విచారణ ఏప్రిల్ 27న జరగనున్నది. ఆ రోజు హైకోర్టులో జరిగే డెవలప్‌మెంట్స్ తర్వాతనే ప్రభుత్వం ప్రకటన విడుదల చేయనున్నది.

కొత్త డీజీపీగా సీవీ ఆనంద్ పేరుపై ఊహాగానాలు :

డీజీపీ శివధర్‌రెడ్డి ఈ నెల 30న పదవీ విరమణ చేయనుండడంతో మరుసటి రోజు నుంచి కొత్త డీజీపీ బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది. యూపీఎస్సీ పంపిన జాబితాలో సీవీ ఆనంద్, వినాయక ప్రభాకర్ ఆప్టే, సౌమ్యా మిశ్రా పేర్లు ఉన్నాయి. ఈ ముగ్గురిలో ఒకరిని ప్రభుత్వం ఎంపిక చేయనున్నది. ఈ ముగ్గురిలో సీవీ ఆనంద్ ఫ్రంట్ రన్నర్‌గా ఉన్నట్లు పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ప్రస్తుతం హోం సెక్రటరీగా ఉన్న సీవీ ఆనంద్ గతంలో నగర పోలీసు కమిషనర్‌గానూ పనిచేశారు. ప్రభుత్వం తాజాగా బదిలీ చేసిన ఆఫీసర్లలో సీవీ ఆనంద్ కూడా ఉన్నారు. కొత్త డీజీపీగా ఆయన పేరు దాదాపు ఖరారైనందున ప్రస్తుతం ప్రభుత్వం బదిలీల జాబితాలో ఆయన పేరు కూడా పెట్టిందన్న మాటలూ వినిపించాయి. ఇప్పటివరకూ నిర్వర్తిస్తున్న బాధ్యతల నుంచి తప్పించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ఇకపైన డీజీపీ బాధ్యతలు అప్పజెప్పే ఉద్దేశమేననే అభిప్రాయం నెలకొన్నది.

ఈ నెల 30 వరకూ హోం సెక్రటరీగా సీవీ ఆనంద్ :

ప్రభుత్వం బదిలీలు చేపట్టినప్పుడు ‘తక్షణం అమల్లోకి’ అనే విధంగానే ఉత్తర్వులు జారీచేస్తాయి. కానీ ఈసారి మాత్రం ‘మే నెల 1వ తేదీ నుంచి అమల్లోకి’ అని ఉత్తర్వులు జారీ అయ్యాయి. డీజీపీ శివధర్‌రెడ్డి ఈ నెల 30న రిటైర్ కానుండడంతో ఆ తర్వాతి రోజు నుంచి కొత్త డీజీపీ (Telangana DGP) వస్తారన్న ఉద్దేశంతోనే ఈ బదిలీ ఉత్తర్వులను ప్రభుత్వం ప్రణాళిక ప్రకారం విడుదల చేసింది. ఈ నెల 27న హైకోర్టులో జస్టిస్ విజయసేన్‌రెడ్డి నేతృత్వంలోని బెంచ్ ముందు పిటిషన్ విచారణ జరగనుండడం, తాజాగా జరిగిన బదిలీలన్నీ మే నెల 1 నుంచి అమల్లోకి రానుండడంతో కొత్త డీజీపీ ఎంపికపై ప్రభుత్వ ప్రకటన సైతం ఈ నెల 27న తర్వాతనే ఉండే అవకాశముంది. ఇటీవలే వీసీ సజ్జనార్, మహేష్ భగవత్, స్వాతి లక్రా, అనిల్ కుమార్, చారు సిన్హా, వీవీ శ్రీనివాసరావు లాంటి ఆరుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు అదనపు డీజీపీ నుంచి డీజీపీగా పదోన్నతి కల్పించడం గమనార్హం.

Read Also: ఫస్ట్ బెంగాల్.. నెక్స్ట్ ఢిల్లీ.. ఎన్నికల ప్రచారంలో మమతా బెనర్జీ

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>