కలం, నిర్మల్: నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం బన్సపల్లి (Bansapalli) గ్రామ శివారులో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు సంచరిస్తున్నట్లు గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేయడంతో నిర్మల్ పోలీసులు (Nirmal Police) వెంటనే స్పందించారు. జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్ (DSP Srinivas) గ్రామాన్ని సందర్శించి సర్పంచ్, గ్రామ పెద్దలు, స్థానికులతో మాట్లాడి పరిస్థితిని పరిశీలించారు.
గ్రామస్థులు తెలిపిన వివరాలను తెలుసుకున్న అనంతరం ప్రస్తుతం గ్రామంలో ఎలాంటి దొంగతనం లేదా నేర ఘటన జరిగినట్లు నిర్ధారణ కాలేదని తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాస్ మాట్లాడుతూ.. గ్రామస్తులు పుకార్లను నమ్మకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్రామంలోకి వచ్చే అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాలు కనిపిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలని కోరారు.
ప్రజల్లో భరోసా కల్పించేందుకు గ్రామంలో పోలీసు గస్తీతో పాటు, పెట్రోలింగ్ వాహనం క్రమం తప్పకుండా గ్రామాన్ని సందర్శించేలా అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ప్రజల సహకారంతోనే నేరాలను సమర్థంగా అరికట్టవచ్చని, గ్రామాల భద్రత కోసం నిర్మల్ పోలీసులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటారని డీఎస్పీ స్పష్టం చేశారు.

