అన్న త్యాగం.. ఈ రాజస్థాన్ ఎక్స్‌ప్రెస్ అశోక్ శర్మ

కలం, స్పోర్ట్స్: ఒక సామాన్య కుటుంబం. ఇద్దరు కొడుకులకు క్రికెట్ అంటే పిచ్చి. కానీ ఇద్దరినీ ఆడించే స్తోమత ఆ తండ్రికి లేదు. రాత్రిపూట పేపర్లు వేస్తూ, పగలు డ్రైవర్ గా పనిచేసే ఆ తండ్రి ఒకరోజు ఇద్దరు కొడుకులను పిలిచి ఒక కఠిన నిజాన్ని చెప్పాడు. ‘‘మీ ఇద్దరిలో ఒక్కరిని మాత్రమే నేను ఆడించగలను. మీరే తేల్చుకోండి!’’ అని. ఆ క్షణంలో అన్న అక్షయ్ తన కలలను త్యాగం చేస్తూ, తమ్ముడిని ముందుకు నెట్టాడు. ఆ తమ్ముడే జింబాబ్వే పర్యటనలో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన రాజస్థాన్ ఎక్స్‌ప్రెస్ అశోక్ శర్మ.

గంటకు 154 కి.మీ. వేగంతో బౌలింగ్..

గంటకు 154 కి.మీ. వేగంతో బంతులు విసురుతూ, ప్రస్తుతం టీమిండియాలో సంచలనంగా మారాడు అశోక్ శర్మ (Ashok Sharma) . చిన్నప్పటి నుంచే అన్నను చూస్తూ క్రికెట్ నేర్చుకున్నాడు. అన్నదమ్ములిద్దరూ ఫాస్ట్ బౌలర్లే. కానీ ఆర్థిక ఇబ్బందుల వల్ల అన్న తన ఆటను ఆపేసి, తమ్ముడికి బాటలు వేశాడు. తమ్ముడిని బైక్ పై ప్రతిరోజూ 45 కి.మీ. దూరంలో ఉన్న ‘అరవళి క్రికెట్ అకాడమీ’కి తీసుకెళ్లేవాడు. అశోక్ ప్రతిభను మొదటగా గుర్తించిన అక్కడి రంజీ క్రికెటర్ వివేక్ యాదవ్.. ఫీజు చెల్లించే స్థోమత లేకపోవడంతో తన అకాడమీలోనే ఉచితంగా వసతి కల్పించి కోచింగ్ ఇచ్చాడు. టెన్నిస్ బాల్ తో వేగంగా బౌలింగ్ చేయడం అలవాటైన అశోక్ కు.. లెదర్ బాల్ తో లైన్ అండ్ లెంగ్త్ ను ఎలా మెయింటైన్ చేయాలో కోచ్ జగ్సిమ్రాన్ సింగ్ నేర్పించాడు.

క్రికెట్ వదిలేస్తానని కన్నీళ్లు..

అశోక్ ప్రయాణం అంత సులువుగా సాగలేదు. రాజస్థాన్ అండర్-19 జట్టుకు ఎంపికైనా, కేవలం మూడు మ్యాచ్ లకే అతడిని జట్టు నుంచి తొలగించారు. దాదాపు మూడేళ్ల పాటు ఎలాంటి అవకాశాలు రాకపోవడంతో నిరాశ చెందిన అశోక్.. ‘‘నేను ఇక క్రికెట్ వదిలేస్తా అన్న.. ఏదైనా వేరే పని చూసుకుంటాను’’ అని ఒక దశలో కన్నీళ్లు పెట్టుకున్నాడు. కానీ కుటుంబం ఇచ్చిన ధైర్యంతో మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టాడు. ‘రెడ్ బుల్ స్పీడ్స్టర్’ పోటీల ద్వారా ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ కు నెట్ బౌలర్ గా ఎంపిక కావడం అశోక్ కెరీర్ లో తొలి మలుపుగా మారింది. ఆ తర్వాత కోల్ కతా నైట్ రైడర్స్ జట్టులోకి తీసుకున్నప్పటికీ.. ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు. కానీ ఐపీఎల్ 2026 వేలంలో గుజరాత్ టైటాన్స్ అతని వేగాన్ని గుర్తించింది. ఆశిష్ నెహ్రా పర్యవేక్షణలో మరింత పదును తేలిన అశోక్.. ఐపీఎల్ లో ఏకంగా 154.2 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరి అందరి దృష్టిని ఆకర్షించాడు.

ఒక్క గ్రాము షుగర్ ముట్టలే..

అశోక్ శర్మ కేవలం వేగానికే కాదు, కఠినమైన క్రమశిక్షణకూ మారుపేరు. గత మూడు, నాలుగేళ్లుగా అతను కనీసం ఒక్క గ్రాము చక్కెర (షుగర్) కూడా తీసుకోలేదు. ఐపీఎల్ కు ఎంపికైనప్పుడు శుభాకాంక్షలు చెప్పడానికి స్వీట్లు తీసుకొచ్చినా, వాటికి మర్యాదపూర్వకంగా నో చెప్పి తన డైట్ ను కచ్చితంగా పాటించాడు. జిమ్ లో తీవ్రంగా శ్రమిస్తూ తన శరీరాన్ని ఒక పక్కా అథ్లెట్ గా తీర్చిదిద్దుకున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో దేశంలోనే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచి.. ఆపై ఇండియా-ఏ జట్టుకు ఆడి, ఇప్పుడు సీనియర్ జట్టులో స్థానం సంపాదించుకున్నాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>