కలం, వెబ్ డెస్క్: రాష్ట్ర ఉద్యోగులకు (Telangana Employees) తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రూ.2 వేల కోట్ల బకాయిలు విడుదల చేస్తూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలు జారీ చేయగా.. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులిచ్చారు. రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి కీలకమైన బకాయిలను ప్రభుత్వం పూర్తిగా చెల్లించిందని డిప్యూటీ సీఎం వివరించారు. అలాగే, రిటైర్డ్ ఉద్యోగుల జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (GPF) బకాయిలు, రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి మే 2025 వరకు పెండింగ్‌లో ఉన్న కమ్యూటేషన్ బకాయిలన్నింటినీ పూర్తిగా చెల్లించినట్లు స్పష్టం చేశారు.
త్వరలోనే మిగతా రూ.4 వేల కోట్లు..
ఉద్యోగుల (Telangana Employees) బకాయిలపై ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జేఏసీ నేతలతో సమీక్ష చేశారు. రాబోయే 100 రోజుల్లో రూ. 6,000 కోట్లు విడుదల చేస్తామని స్పష్టమైన హామీ ఇవ్వడంతో వారంతా ఆందోళన విరమించారు. ఈ హామీని నెరవేర్చే దిశగా, తాజాగా రూ.2 వేల కోట్లు విడుదల చేయడం గమనార్హం. ముందస్తు ప్రణాళికలు, పక్కా కార్యాచరణతోనే ఇది సాధ్యమైందని భట్టి విక్రమార్క అన్నారు. మిగిలిన రూ.4 వేల కోట్లు అతి త్వరలోనే విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు వివరించారు.
Read Also: తెలంగాణలో త్వరలోనే ‘సర్’.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు
Follow Us On : WhatsApp

