కలం, వెబ్ డెస్క్: సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం (Telangana Govt) గ్రామ పంచాయతీలకు (Gram Panchayats) శుభవార్త అందించింది. సంక్రాంతి కానుకగా గ్రామ పంచాయతీలకు రూ.277 కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి, ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆర్థికశాఖ అధికారులు సోమవారం నిధులను వెంటనే విడుదల చేశారు. గ్రామ పంచాయతీల్లో మౌలిక వసతుల అభివృద్ధి, పారిశుధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, గ్రామీణ ఉపాధి కార్యక్రమాలు వంటి పనులు వేగవంతం చేయాలనే ఉద్దేశంతో ఈ నిధులు కేటాయించినట్లు ప్రభుత్వం తెలిపింది. నూతనంగా బాధ్యతలు చేపట్టిన సర్పంచ్‌లు, వార్డు సభ్యులు ప్రజల ఆశలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఈ నిధులు దోహదపడనున్నాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
ప్రజాభవన్‌లో ఆర్థికశాఖ అధికారులతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti) అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆర్థికశాఖ ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా సహా ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీలకు (Gram Panchayats) నిధుల విడుదల, వాటి వినియోగంపై సమీక్ష నిర్వహించారు. సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ, గ్రామాలే రాష్ట్రాభివృద్ధికి పునాది అని అన్నారు. గ్రామ పంచాయతీలను ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. విడుదల చేసిన నిధులను ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి పనులకే వినియోగించాలని, పారదర్శకతతో ఖర్చు చేయాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా గ్రామ పంచాయతీ సర్పంచ్‌లు, వార్డు సభ్యులకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల నమ్మకానికి తగిన విధంగా పనిచేసి, గ్రామాల అభివృద్ధికి అంకితభావంతో కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
Read Also: కుక్క కాట్లకు, మరణాలకు భారీ జరిమానా : సుప్రీం వార్నింగ్
Follow Us On: X(Twitter)


