epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

గ్లోబల్ సమ్మిట్‌కు క్లాసిక్ కల్చరల్ టచ్

కలం డెస్క్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్ (Telangana Global Summit)కు సర్కార్ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. దేశ, విదేశాల నుంచి వచ్చే ఇన్వెస్టర్స్, ఇండస్ట్రియలిస్ట్స్, బిజినెస్ పర్సన్స్, పొలిటీషియన్స్.. ఇలా అన్ని రంగాలకు చెందినవారికి ఇచ్చే ఆతిథ్యం అదిరిపోవాలని, జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉండాలని భావిస్తున్నది. ఇందుకోసం ఒక్కో కమిటీకి ఒక్కో రకమైన బాధ్యతలు అప్పజెప్పింది. నగరంలోని అన్ని స్టార్ హోటళ్ళలో అతిథులకు రూమ్‌లు, సూట్స్ బుక్ అయ్యాయి. ఎయిర్ పోర్టులో వారికి స్వాగతం పలకడం మొదలు తిరిగి వెళ్ళిపోయేంత వరకు నభూతో.. అనే తీరులో ఉండేలా ప్లాన్ చేస్తున్నది. ఒకవైపు తెలంగాణ సంస్కృతిని తెలియజేసేలా క్లాసిక్ కల్చరల్ టచ్‌తో పాటు ఎప్పటికీ గర్వంగా చెప్పుకునేలా రాష్ట్ర వంటకాలతో మంచి రుచి చూపించాలని భావిస్తున్నది.

అధికారులకు కీలక బాధ్యతలు :

గ్లోబల్ సమ్మిట్‌(Telangana Global Summit)కు వచ్చే జాతీయ, అంతర్జాతీయ అతిథులకు శంషాబాద్ ఎయిర్ పోర్టులో సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) అధికారులు ఘన స్వాగతం పలకనున్నారు. విశిష్ట అతిథులకు తెలంగాణా సంస్కృతికి తగినట్లుగా మహిళలు వెల్కమ్ చెప్పనున్నారు. వచ్చే నెల 8, 9 తేదీల్లో ప్రతిష్టాత్మకంగా గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రధాని మోడీ మొదలు కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల ముఖ్యులకు రాష్ట్ర మంత్రులే స్వయంగా వెళ్ళి ఇన్విటేషన్ కార్డులు ఇచ్చి ఆహ్వానించనున్నారు. తెలంగాణా కళలు, సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రతీ రోజు ఫ్యూచర్ సిటీలోని ఏర్పాట్లపై మంత్రులు స్వయంగా వెళ్ళి పర్యవేక్షిస్తున్నారు. అధికార యంత్రాంగం ఆ ఏర్పాట్లలో తలమునకలైంది.

ఎప్పటికీ గుర్తుండిపోయే కానుకలు :

దేశ విదేశాల నుంచి వచ్చే ప్రముఖులు, అతిథులకు చిరకాలం గుర్తుండి పోయేలా కానుకలను సైతం ప్రభుత్వం సిద్ధం చేస్తున్నది. హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న వెంటనే వాళ్లకు ఆకర్షణీయమైన ప్రత్యేక కిట్లను, డెలీషియస్ ఫుడ్ బాస్కెట్లను ప్రభుత్వం అందజేయనున్నది. తెలంగాణకే ప్రత్యేకంగా ఉండే పోచంపల్లి ఇక్కత్, ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లోగో’తో కూడిన ప్రత్యేక సావనీర్, చేర్యాల నకాషి (తెలంగాణ యూనిక్ పెయింటింగ్, పాతబస్తీ స్పెషల్ అత్తర్, హైదరాబాద్ బ్రాండ్‌గా ఫేమస్ అయిన ముత్యాలతో కూడిన ఆభరణాలు ఉన్న కిట్లను ఇవ్వనున్నది.

తెలంగాణ ఫుడ్ బాస్కెట్స్ :

జాతీయ, అంతర్జాతీయ అతిథులకు ప్రత్యేక ఫుడ్ బాస్కెట్లు కూడా సిద్ధమవుతున్నాయి. తెలంగాణా కల్చర్ కు అనుగుణంగా ఫుడ్ బాస్కెట్ల డిజైన్ ఇప్పటికే పూర్తయింది. ఈ ఫుడ్ బాస్కెట్‌లో మహువ (ఇప్ప) లడ్డూలు, సకినాలు, అప్పాలు, బాదామ్ కీ జాలి (బాదం, ఖాజు, చక్కెరల మిశ్రమం).. ఇలాంటి ఎన్నో రకాల సంప్రదాయ వంటకాలు మెనూలో చోటుచేసుకున్నాయి. తెలంగాణకు, హైదరాబాద్‌కు బ్రాండ్‌గా ఉన్న బిర్యానీ, ఖుబానీ కా మీఠా, మిర్చి కా సాలన్, పచ్చిపులుసు.. ఇలాంటివన్నీ స్పెషల్ అట్రాక్షన్. గ్లోబల్ సమ్మిట్ వేదికగా తెలంగాణా కళలు, సంస్కృతి, వంటకాల ప్రత్యేకతలను ప్రపంచానికి ప్రభుత్వం పరిచయం చేయనున్నది.

Read Also: ఏపీకన్నా తెలంగాణ బెటర్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>