తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ (Global Summit)ను భారీ ఎత్తున నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధం అవుతోంది. ఈ క్రమంలో సమ్మిట్ నిర్వహణపై రోజూ సమీక్షలు నిర్వహిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సమ్మిట్‌కు ఎవరెవరిని ఆహ్వానించాలి అన్న అంశంపై కూడా కసరత్తులు చేశారు. కాగా ఈ సమ్మిట్‌కు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర ప్రభుత్వ పెద్దలను కూడా పిలవాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను వ్యక్తిగతంగా పిలవాలని ప్రభుత్వం భావించింది. ఈ బాధ్యతలను సీఎం రేవంత్ తన క్యాబినెట్ మంత్రులకు అప్పగించారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్ వెల్లడించారు.
ఈ నెల 4వ తేదీ నుంచి మంత్రులు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసి అధికారిక ఆహ్వానాలు అందించనున్నారు. సమ్మిట్‌కు దేశవ్యాప్తంగా రాజకీయ, పరిశ్రమ, విధాన నాయకుల హాజరును కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రకటన చేసింది. ఈ సమ్మిట్‌కు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కాంగ్రెస్ జాతీయ నేత రాహుల్ గాంధీని కూడా ఆహ్వానించాలని సీఎం రేవంత్ భావిస్తున్నారు.
రాష్ట్రాల వారీగా ఆహ్వాన బాధ్యతలు ఇలా:
జమ్మూ & కశ్మీర్, గుజరాత్ – ఉత్తమ్ కుమార్ రెడ్డి
పంజాబ్, హర్యానా – దామోదర రాజనర్సింహ
ఆంధ్రప్రదేశ్ – కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి
కర్ణాటక, తమిళనాడు – శ్రీధర్ బాబు
ఉత్తర్ ప్రదేశ్ – పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
రాజస్థాన్ – పొన్నం ప్రభాకర్
ఛత్తీస్ ఘడ్ – కొండా సురేఖ
వెస్ట్ బెంగాల్ – సీతక్క
మధ్యప్రదేశ్ – తుమ్మల నాగేశ్వర్ రావు
అస్సాం – జూపల్లి కృష్ణారావు
బీహార్ – వివేక్ వెంకటస్వామి
హిమాచల్ ప్రదేశ్ – అడ్లూరి లక్ష్మణ
ఒడిశా – వాకిటి శ్రీహరి
మహారాష్ట్ర – అజారుద్దీన్
సమ్మిట్‌లో పెట్టుబడుల అవకాశాలు, విధాన సంస్కరణలు, అంతర్జాతీయ భాగస్వామ్యాలపై ప్రత్యేక చర్చలు జరగనున్నట్లు అధికారులు తెలిపారు. తెలంగాణను పరిశ్రమలు, ఇన్నోవేషన్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగాలలో జాతీయ కేంద్రంగా అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం ఈ సదస్సును కీలక వేదికగా చూస్తోంది. సమ్మిట్ విజయవంతం కావడానికి దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులు, పరిశ్రమల పెద్దల పాల్గొనటం అత్యంత ముఖ్యమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.


