కలం, వెబ్ డెస్క్ : తెలంగాణవ్యాప్తంగా వినాయక నిమజ్జనోత్సవాలు (Ganesh Immersion) వైభవంగా జరుగుతున్న వేళ రాష్ట్రంలో పలు చోట్ల విషాదకర ఘటనలు చోటుచేసుకున్నాయి. పదకొండు రోజుల పాటు సాగిన ఈ గణేష్ ఉత్సవాల్లో నిమజ్జన ఊరేగింపులలో వివిధ ప్రమాదాల కారణంగా ఒక సబ్ ఇన్స్పెక్టర్ సహా మొత్తం 13 మంది ప్రాణాలు కోల్పోగా, మరొక 26 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ వివరాలను తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ (DGP CV Anand)వెల్లడించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఈ సంవత్సరం పబ్లిక్ ప్రదేశాలలో రికార్డు స్థాయిలో మొత్తం లక్షా 24 వేల విగ్రహాలను అధికారికంగా ప్రతిష్టించినట్లు డీజీపీ తెలిపారు. వీటితో పాటు ఇళ్లలో, గేటెడ్ కమ్యూనిటీలలో, వివిధ అపార్ట్‌మెంట్లలో కలిపి మరో 3.5 లక్షల నుండి 4 లక్షల వరకు వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసి పూజలు నిర్వహించినట్లు పోలీసులు అంచనా వేశారు. ఈ భారీ ఉత్సవాల వేళ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినప్పటికీ, కొన్ని చోట్ల అనుకోని ప్రమాదాలు జరిగి ప్రాణనష్టం సంభవించడం పట్ల డీజీపీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

