కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాల (EV) వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఈవీ వాహనాల కొనుగోలుపై 10 నుంచి 20 శాతం వరకు డిస్కౌంట్ కల్పించేలా తయారీ సంస్థలతో ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది. సచివాలయం ముందు ఏర్పాటు చేసిన ఈవీ వాహనాల ప్రదర్శనను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు, డీజీపీ శివధర్ రెడ్డి, రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి, ఐ అండ్ పీఆర్ కమిషనర్ ప్రియాంక, ఉద్యోగ సంఘాల నేతలతో కలిసి పరిశీలించారు. ఢిల్లీ వంటి నగరాల్లో ఎదురవుతున్న తీవ్ర కాలుష్య పరిస్థితులు హైదరాబాద్‌కు రాకూడదనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా పాలన ప్రభుత్వం నూతన ఈవీ విధానాన్ని (Telangana EV Policy) తీసుకువచ్చింది. ఈ విధానం కింద ఈవీ వాహనాలకు జీరో రోడ్ టాక్స్, జీరో రిజిస్ట్రేషన్ ఛార్జీల మినహాయింపును కల్పిస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి దాదాపు వెయ్యి కోట్ల రూపాయల ఆదాయం తగ్గినా, పర్యావరణ హితం కోరి ఈ నిర్ణయం తీసుకున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.
మహేంద్ర ఎలెక్ట్రిక్స్, ఏథర్ ఎనర్జీ, గ్రావిటన్ మోటార్స్, ఓలా వంటి ప్రముఖ కంపెనీలు ప్రభుత్వ ఉద్యోగులకు రాయితీలు ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి. ప్రభుత్వ శాఖలు కొత్త వాహనాలను కొనుగోలు చేసినా లేదా అద్దెకు తీసుకున్నా అవి కచ్చితంగా ఈవీలే ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. ఇప్పటికే నగరంలోని కోర్ ఏరియాల్లో ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయని, డీజిల్ ఆటోలను కూడా ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చే (రెట్రోఫిట్టింగ్) ప్రక్రియను చేపడుతున్నామని మంత్రి తెలిపారు. ప్రజల్లోకి ఈ పథకాలను తీసుకెళ్లడంలో ఉద్యోగులే వారధిగా ఉంటారని, అందుకే ముందుగా సీఎస్, ఉద్యోగ సంఘాల నేతలు ఈవీ వాహనాలను బుక్ చేసుకుని ఆదర్శంగా నిలుస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
కాలుష్య రహిత రాష్ట్రమే లక్ష్యం: సీఎస్
తెలంగాణను కాలుష్య రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే దృఢ సంకల్పంతో ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని సీఎస్ రామకృష్ణ రావు (CS Ramakrishna Rao) తెలిపారు. రాష్ట్ర జనాభాలో 30 శాతం మంది హైదరాబాద్‌లోనే నివసిస్తున్నారని, ఇక్కడ గాలి నాణ్యత తగ్గకుండా చూడాలంటే ఈవీ వాహనాల వాడకం తప్పనిసరి అని ఆయన పేర్కొన్నారు. సుమారు 2 వేల కిలోమీటర్ల మేర కోర్ ఏరియాను కాలుష్య రహితంగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, అందుకోసం రెడ్కో ద్వారా అన్ని ప్రాంతాల్లో ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. మరోవైపు రవాణా శాఖలో తీసుకొచ్చిన సంస్కరణల వల్ల ఇకపై షోరూమ్‌లలోనే వాహన రిజిస్ట్రేషన్ చేసుకునే సౌలభ్యం కలిగిందని, 15 ఏళ్లు దాటిన పాత వాహనాలను స్క్రాపేజీకి పంపిస్తున్నామని అధికారులు స్పష్టం చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులందరూ ప్రభుత్వం కల్పిస్తున్న ఈ ప్రోత్సాహకాలను (Telangana EV Policy) సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.
Read Also: భారతదేశంలో ఎవరి మతం వాళ్లకు ఉంటుంది: వాకిటి శ్రీహరి
Follow Us On : WhatsApp

