ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ టెన్షన్.. టెన్షన్..

కలం, తెలంగాణ బ్యూరో : గత ప్రభుత్వంలో చోటుచేసుకున్న అవకతవకలు ఈసారి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల (Outsourcing Employees) వేతనాలకు ఎసరు తెచ్చేలా ఉంది. ఇంతకాలం బోగస్ ఉద్యోగుల పేరుతో కొనసాగిన విధానానికి సర్కార్ చెక్ పెట్టింది. ప్రతీ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి బయోమెట్రిక్ వివరాలు ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదు చేయాల్సిందిగా రాష్ట్ర ఆర్థిక శాఖ కొత్త మెకానిజానికి శ్రీకారం చుట్టింది. దీనికి తోడు ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీలు సైతం వాటి లైసెన్సును ఆన్‌లైన్ పోర్టల్ ద్వారానే రెన్యూవల్ చేసుకోవాలని, ఏ డిపార్టుమెంటులో ఏ ఉద్యోగిని పెట్టారో వారి వివరాలన్నీ నమోదు చేయాలని ఆంక్షలు విధించింది. కొత్త ఆర్థిక సంవత్సరం మొదలుకావడంతో ఈ పాలసీని పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించింది. పూర్తిస్థాయిలో వివరాలను పరిశీలించి అప్రూవల్ అయిన తర్వాతనే వారికి పేమెంట్ మాడ్యూల్ రెడీ అవుతుంది. కానీ వివరాలు అసంపూర్ణంగా ఉండడంతో ఈ నెల జీతం పడుతుందో లేదోననే టెన్షన్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల్లో మొదలైంది.

ఆన్‌లైన్ పోర్టల్‌లో అప్‌లోడింగ్ అంతంతే :

రాష్ట్రంలో మొత్తం 431 విభాగాల్లో దాదాపు 5.35 లక్షల మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తూ ఉంటే ఇప్పటివరకు 61 డిపార్టుమెంట్లకు చెందిన కేవలం 40 వేల మంది వివరాలే అప్‌లోడ్ అయినట్లు ఫైనాన్స్ డిపార్టుమెంట్ ఆఫీసర్ ఒకరు వివరించారు. ఆన్‌లైన్ విధానం ఔట్ సోర్సింగ్, ఇతర తాత్కాలిక ఉద్యోగుల ఫ్యూచర్‌ను గందరగోళంలో పడేసింది. ప్రభుత్వం వాళ్ల విధులను రెన్యూవల్ చేయలేదు. ప్రతి ఏటా మార్చి 31న గడువు ముగిసిన వెంటనే, ఏప్రిల్ నెల నుంచి సర్వీసులను పునరుద్ధరించడం ఆనవాయితీ. కానీ, ఈసారి మాత్రం కొత్త ఫైనాన్షియల్ ఇయర్ మొదలై ఇరవై రోజులు దాటినా ఇంకా ఆ ప్రక్రియ మొదలుకాలేదు. ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ సర్వీసును పునరుద్ధరించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దాదాపు 5.35 లక్షల మంది ఉద్యోగుల భవితవ్యం త్రిశంకు స్వర్గంలో ఊగిసలాడుతోంది. ఇదే జరిగితే వారు విధులకు దూరంగా ఉంటే డిపార్టుమెంట్లలో పనులు ఏమవుతాయన్నది కూడా ఒక గందరగోళం.

బోగస్ ఉద్యోగుల వ్యవహారంతోనే ఈ చిక్కులన్నీ :

గత ప్రభుత్వంలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల (Outsourcing Employees) నియామకాల్లో భారీ స్థాయిలో అవకతవకలు జరిగాయని, బోగస్ ఉద్యోగులు పుట్టుకొచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి. వివిధ శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగులకు, ఆర్థికశాఖ దగ్గర ఉన్న డేటాకు మధ్య భారీ వ్యత్యాసం ఉన్నట్లు తేలింది. అధికారులు, ఏజెంట్లు కుమ్మక్కై దొంగ లెక్కలతో, తప్పుడు సమాచారంతో కోట్లాది రూపాయలు మింగేశారన్నది ఓ అభియోగం. దాదాపు 40 వేల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పేరుతో ఖజానా నుంచి నిధులు దుర్వినియోగమైనట్లు అంచనా. పోలీసు శాఖ రహస్యంగా దర్యాప్తు చేసింది. ఈ తతంగానికి చెక్ పెట్టేందుకు ఫైనాన్స్ డిపార్టుమెంట్ ఆఫీసర్లు భారీ కసరత్తే చేశారు. ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు, తాత్కాలిక ఉద్యోగుల వివరాలన్నింటినీ ఐఎఫ్ఎంఐఎస్ (ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్) పోర్టల్‌లో పొందుపరచాలని అన్ని హెచ్ఓడీలకు హుకుం జారీ చేశారు. రెన్యూవల్ ప్రాసెస్ కూడా ఆన్‌లైన్ ద్వారానే జరగాలని స్పష్టం చేశారు.

Read Also: ‘భూధార్’తో రిజిస్ట్రేషన్

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>