బ‌క్రీద్‌ శాంతియుత వాతావ‌ర‌ణంలో జ‌రుపుకోవాలి: డీజీపీ సీవీ ఆనంద్

కలం, నిజామాబాద్ బ్యూరో: రాబోయే బక్రీద్ పండుగ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా శాంతి భద్రతల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించిన తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ (DGP CV Anand) జిల్లా స్థాయి పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అన్ని కమిషనరేట్లు, జిల్లాల ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు, అదనపు డీసీపీలు, ఏసీపీలు సంబంధిత విభాగాల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ బక్రీద్ పండుగను ప్రజలు ప్రశాంత వాతావరణంలో పరస్పర సహకారంతో జరుపుకొనేలా పోలీస్ శాఖ సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా ప్రార్థనా స్థలాలు, ఈద్గాలు, మసీదులు, ప్రధాన రహదారులు, మార్కెట్ ప్రాంతాలు, జన సంచారం అధికంగా ఉండే ప్రదేశాల్లో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. పండుగ రోజున ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందించి, వాహన రాకపోకలను సజావుగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ముఖ్యంగా ఈద్గాల వద్ద పార్కింగ్ ఏర్పాట్లు, ట్రాఫిక్ మళ్లింపులు, అత్యవసర సేవలకు ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేయాలని సూచించారు.

సామాజిక మాధ్యమాల ద్వారా ఎలాంటి అసత్య ప్రచారాలు, రెచ్చగొట్టే పోస్టులు లేదా వదంతులు వ్యాప్తి చెందకుండా సైబర్ మానిటరింగ్‌ను మరింత బలోపేతం చేయాలని డీజీపీ ఆదేశించారు. ఎలాంటి అనుమానాస్పద సమాచారం వచ్చినా వెంటనే స్థానిక పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అంతేకాకుండా మత పెద్దలు, ప్రజాప్రతినిధులు, శాంతి కమిటీ సభ్యులతో ముందస్తుగా సమావేశాలు నిర్వహించి సామరస్య వాతావరణం నెలకొల్పాలని తెలిపారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని సున్నిత ప్రాంతాలలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, డ్రోన్ కెమెరాలు , సీసీ కెమెరాల పర్యవేక్షణతో భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేయాలని పేర్కొన్నారు. అన్ని చెక్ పోస్టులలో సిబ్బంది విధులు నిర్వహించాలని, పోలీస్ సిబ్బంది, మున్సిపల్ అధికారులు, రెవెన్యూ అధికారులు, అందరితో కో-ఆర్డినేషన్ పద్ధతిలో విధులు నిర్వహించాలని తెలిపారు.

నిజామాబాద్ జిల్లాలోని రెంజల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల షాటాపూర్ వద్ద జరిగే పశువుల సంతలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పండుగ విధుల్లో పాల్గొనే పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహిస్తూ ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, ఎక్కడైనా చిన్న ఘటన జరిగినా వెంటనే స్పందించి పరిస్థితిని అదుపులోకి తీసుకురావాలని డీజీపీ సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా బక్రీద్ పండుగను శాంతియుతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో నిజామాబాద్ జిల్లా నుండి నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, అదనపు డీసీపీ అడ్మిన్ ఎన్.శుభం ప్రకాష్, అడిషనల్ కలెక్టర్ ( రెవెన్యూ ) కిరణ్ కుమార్, జాయింట్ డైరెక్టర్ అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ గంగాధర్, ఆర్మూర్ డి.ఏ.ఓ అచ్యుత్ రెడ్డి, నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, ట్రాఫిక్ ఏసీపీలు ప్రకాష్, వెంకటేశ్వర్ రెడ్డి, శ్రీనివాస్, మస్తాన్ అలీ, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్‌పెక్ట‌ర్‌ శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>