70శాతం సీసీ కెమెరాలు వేస్ట్ : డీజీపీ సీవీ ఆనంద్

కలం, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఉన్న ఆరు లక్షల కెమెరాల్లో కేవలం 32 శాతమే పనిచేస్తున్నాయని, మిగిలినవి నిర్వహణ లోపం కారణంగా ఫంక్షనింగ్‌లో లేవని కొత్తగా డీజీపీ బాధ్యతలు చేపట్టిన సీవీ ఆనంద్ (DGP CV Anand) వెల్లడించారు. పాడైపోయిన కెమెరాల స్థానంలో కొత్తవాటిని అమరుస్తామని, ఇకపైన అదనంగా సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉండదని అన్నారు. నేరాల దర్యాప్తులో సీసీటీవీ కెమెరాల ఫుటేజీ చాలా కీలకమైనదన్నారు. దాదాపు నాలుగున్నర దశాబ్దాల నుంచి నక్సలైట్ల అణచివేత కోసం ఏర్పడిన గ్రేహౌండ్స్ విభాగాన్ని ఇకపైన రేషనలైజ్ చేసి డ్రగ్స్ కంట్రోల్, సైబర్ సెక్యూరిటీ నేరాల నియంత్రణ అవసరాలకు వినియోగిస్తామన్నారు. ఎస్ఐబీని సైతం వీటికి సంబంధించిన సమాచారాన్ని సేకరించేందుకు వాడతామన్నారు. డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ, పోలీసు వ్యవస్థలో తీసుకురావాల్సిన మార్పులపై దృష్టి పెంచుతామన్నారు.

క్రిమినల్స్ ఈజీ నేరాలకు అలవాటుపడ్డారు :

గతంతో పోలిస్తే ఇటీవలి కాలంలో నేరాల స్వభావం, స్వరూపం మారుతున్నదని డీజీపీ సీవీ ఆనంద్ అన్నారు. ఒకప్పటిలాగా దోపిడీలు, దొంగతనాలు చేసే ఘటనలు తగ్గుతున్నాయని, కష్టపడకుండా నాలుగు గోడల మధ్య కూర్చుని స్మార్ట్‌గా నేరాలు చేయడానికి క్రిమినల్స్ అలవాటు పడ్డారని అన్నారు. ఒక టేబుల్, కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్, ఇంటర్నెట్ కనెక్షన్ లాంటివి ఉంటే సరిపోయేలా ఈ నేరాలకు పాల్పడుతున్నారని అన్నారు. డిజిటల్ అరెస్ట్, బెదిరించడం, హ్యాకింగ్ చేసి భయపెట్టడం లాంటివాటివన్నీ ఇలాంటివేనని అన్నారు. డిజిటల్ పరిజ్ఞానం తక్కువగా ఉన్నవారు, వృద్ధులే ఈ నేరస్తులకు టార్గెట్ అని వివరించారు. అందుకే ప్రభుత్వం ప్రత్యేకంగా సైబర్ సెక్యూరిటీ బ్యూరోను ఏర్పాటు చేసిందన్నారు. చాలా కేసుల్ని ఈ బ్యూరో డిటెక్ట్ చేస్తున్నదని, కొన్ని ఘటనల్లో బ్యాంకు అధికారులను కూడా పట్టుకున్నదన్నారు. ఫీల్డులో ఉన్నవారి భాగస్వామ్యాన్ని కూడా తీసుకుంటే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయన్నారు.

డ్రగ్స్ వినియోగం ప్రమాదకరంగా మారింది :

రాష్ట్రంలో మాదకద్రవ్యాల విక్రయం, వినియోగం బాగా పెరిగిందని, దీన్ని అరికట్టడం పోలీసులకు మాత్రమే కాక సమాజానికే సవాలుగా మారిందని డీజీపీ సీవీ ఆనంద్ (DGP CV Anand) అన్నారు. సమాజంలో చాలా ప్రాంతాలకు ఇది విస్తరించిందని, పిల్లలు కూడా ప్రమాదాల్లో పడుతున్నారని అన్నారు. చివరకు స్కూల్లు, కాలేజీల దాకా వెళ్ళిందని, తల్లిదండ్రుల్లో కూడా పిల్లల వ్యసనాల పట్ల ఆందోళన ఉన్నదన్నారు. దీనిని తుదముట్టించడానికి ఈగల్ వ్యవస్థ, హెచ్-న్యూ విభాగాలు పనిచేస్తున్నాయన్నారు. జిల్లాల్లోనూ ఈ నేరాలు జరుగుతున్నందున ఎస్పీలు, సీపీలు కూడా యాంటీ నార్కోటిక్ డ్రైవ్ చేపట్టకపోతే పట్టు సాధించడం కష్టమవుతుందన్నారు. ఎన్ని కేసులు పెట్టినా, ఎందరిని పట్టుకున్నా తగ్గడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా టాప్ ప్రయారిటీ అప్పగించిందని, అన్ని విభాగాలనూ ఇన్‌వాల్వ్ చేస్తున్నామన్నారు. విద్యాసంస్థల్లో యాంటీ డ్రగ్స్ కమిటీలు ఏర్పాటయ్యాయన్నారు.

సిటీలో ట్రాఫిక్ మేనేజ్‌మెంట్‌లోకి ఏఐ టెక్నాలజీ :

హైదరాబాద్ నగరంలో ప్రతీ రోజు కొన్ని వేల వాహనాలు కొత్తగా పుట్టుకొస్తున్నాయని, లక్షల సంఖ్యలో నిత్యం రోడ్డెక్కుతున్నాయని, ట్రాఫిక్ నియంత్రణ చాలా కీలకమైనదిగా మారిందన్నారు. ఒకవైపు ఫుట్‌ఫాత్‌లపై బిజినెస్‌లు, ఆక్రమణలతో రోడ్ల వెడల్పు తగ్గిపోయి ట్రాఫిక్ జామ్ ఏర్పడుతున్నదన్నారు. నాలుగు పోలీసు కమిషనరేట్ల పరిధిలోనూ ఈ సమస్య తీవ్రంగానే ఉన్నదని, మౌలిక సౌకర్యాలను పెంచడం సులభమైన విషయం కాదన్నారు. ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ టెక్నిక్స్ మెరుగుపర్చుకోవడంతో పాటు ఇంజినీరింగ్ కోణం నుంచి ఆలోచించి రోడ్లపైన మార్పులు చేయడం ద్వారా ఉపశమనం తీసుకురావచ్చన్నారు. స్టేట్ లెవెల్‌లోనే ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ ప్రాక్టీసులను స్టాండర్డ్ చేయాలన్నారు. ఏఐ టెక్నాలజీని వినియోగించి స్మార్ట్ సిస్టమ్ తెస్తామన్నారు. మహిళల, పిల్లల భద్రతకు ట్రాఫికింగ్ పెద్ద సమస్యగా మారిందని, వ్యవస్థీకృత నేరంగా మారిందని, గ్యాంగులను పట్టుకోవాల్సి ఉందన్నారు. ఆహార కల్తీ, బెట్టింగ్ యాప్స్, మనీ లాండరింగ్, రియల్ ఎస్టేట్ ఫ్రాడ్స్ ఇవన్నీ పెరుగుతున్నాయన్నారు.

19 వేల ఖాళీ పోస్టులకు రిక్రూట్‌మెంట్ :

పోలీసు శాఖలో దాదాపు 19 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఐదు వేలకు రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ వచ్చిందని, మిగిలినవాటిపై రివ్యూ చేసి భర్తీపై నిర్ణయం తీసుకుంటామన్నారు. డీఎన్ఏ, సీఐడీ లాంటి విభాగాల్లో అవసరానికి తగిన సిబ్బంది లేరని, కొన్నిచోట్ల అవసరం లేకపోయినా ఎక్కువ మంది ఉన్నారని, దీన్ని స్ట్రీమ్‌లైన్ చేయాలన్నారు. నేరాల సంఖ్య, నివారణ, దర్యాప్తు.. వీటన్నింటినీ విశ్లేషించి డిప్లాయ్‌మెంట్ చేయాల్సి ఉన్నదన్నారు. ట్రాఫిక్ ఉల్లంఘనలపై కోర్టుల్లోనూ కేసులు ఉన్నాయని, కొన్నిసార్లు చార్జిషీట్ వేసిన తర్వాత కూడా కోర్టులు కొట్టివేస్తున్నాయని, చిన్నచిన్న గ్రమటికల్ ఎర్రర్స్, టెక్నికల్ ఫాల్ట్స్, డ్రాఫ్టింగ్ స్కిల్స్ లేకపోవడం కారణమన్నారు. దీన్ని అధిగమించడానికి ఏఐ టెక్నాలజీ వాడతామన్నారు. అగ్నిప్రమాదాలు, వరదలు లాంటి ఘటనల్లో డ్రోన్లను వినియోగించాలని భావిస్తున్నామన్నారు.

పోలీసు విభాగాల మధ్య సమన్వయం :

మారుతున్న నేరాల స్వభావానికి తగినట్లుగా పోలీసులకు మెలకువలను అందించడం, ప్రత్యేక శిక్షణ ఇవ్వడం, విభాగాల మధ్య సమన్వయం నెలకొల్పడం.. ఇవన్నీ తక్షణ సవాళ్ళు అని డీజీపీ సీవీ ఆనంద్ అన్నారు. పోలీసు డిపార్టుమెంటుపైనా, వ్యక్తులపైనా వచ్చే కామెంట్లను సీరియస్‌గా తీసుకుంటామన్నారు. రాజ్యాంగం భావ ప్రకటనా స్వేచ్ఛకు ఎంత వెసులుబాటు ఇచ్చిందో అదే సమయంలో కొన్ని పరిమితులు, ఆంక్షలు కూడా ఉన్నాయని, చట్టపరంగా వ్యవహరించక తప్పదన్నారు. కార్డన్ సెర్చ్ నేరాల నివారణకు చాలా దోహదపడే విధానమని, కానీ వ్యక్తిగత స్వేచ్ఛకు ఇబ్బందికరమనే ఆందోళన కూడా ఉన్నదని, బ్యాలెన్స్ చేసుకుంటూ దీన్ని అమలు చేస్తామన్నారు. డ్రగ్ సప్లయర్స్, సంఘ విద్రోహ చర్యలకు పాల్పడే ప్రమాదం ఉందని తెలిసినప్పుడు నిర్వహించక తప్పదన్నారు.

Read Also: ఇండియా లో పెరుగుతున్న డింక్​ కల్చర్..!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>