కలం, మహబూబ్ నగర్ బ్యూరో : నవజాత శిశువు ఆరోగ్య సంరక్షణలో తల్లిపాలే కీలకమని మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తా (Khushboo Gupta) అన్నారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు-2026 (Breastfeeding Week Celebrations) సందర్భంగా ఆగస్టు 1 నుండి 7వ తేదీ వరకు నిర్వహించనున్న కార్యక్రమాల్లో భాగంగా శనివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ఖుష్బూ గుప్తా ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
నవజాత శిశువు ఆరోగ్యవంతమైన ఎదుగుదలకు తల్లిపాలే సంపూర్ణ పోషకాహారమని అన్నారు. శిశువు జన్మించిన తొలి గంటలోనే తల్లిపాలను ప్రారంభించడం ద్వారా వ్యాధి నిరోధక శక్తి పెంపొందడంతో పాటు అనేక అంటువ్యాధుల నుంచి రక్షణ లభిస్తుందని తెలిపారు. పుట్టిన తొలి ఆరు నెలల వరకు శిశువుకు కేవలం తల్లిపాలు మాత్రమే అందించాలని, అనంతరం వయస్సుకు తగిన పౌష్టికాహారంతో పాటు రెండేళ్ల వరకు లేదా అంతకంటే ఎక్కువ కాలం తల్లిపాలను కొనసాగించాలని సూచించారు.
తల్లిపాల ప్రాముఖ్యతపై సమాజంలోని ప్రతి కుటుంబానికి విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ (Khushboo Gupta) పేర్కొన్నారు. గర్భిణులు, బాలింతలకు శాస్త్రీయ అవగాహన కల్పిస్తూ తల్లిపాలను ప్రోత్సహించేందుకు వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది సమన్వయంతో కృషి చేయాలని సూచించారు. తల్లి, శిశు ఆరోగ్య సంరక్షణలో తల్లిపాలు అత్యంత కీలకమైనవని, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి తల్లిపాల ప్రోత్సాహం ఎంతో అవసరమని అన్నారు.
తల్లి పాలు శిశువుకు సరిపోను పట్టిన తర్వాత ఎక్కువగా ఉంటే వృథా చేయకుండా సుషేనా ఫౌండేషన్, దాత్రి మిల్క్ బ్యాంకు కు డొనేట్ చెయ్యాలని సూచించారు. అంతకుముందు ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకొని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఆవరణలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. రంగా అజ్మీరా, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. ఏ. శ్రీనివాసులు, జిల్లా సంక్షేమ అధికారి జరీనా, వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, వైద్య విద్యార్థులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Also Read : అర్బన్ ఇందిరమ్మ ఇండ్లకు బూస్టప్
Follow Us On: Instagram

