epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

సహకార సొసైటీలకు నామినేటెడ్ పోస్టులు

కలం డెస్క్ : సొసైటీల్లో సభ్యులు కాకపోయినా డైరెక్టర్లు కావచ్చా?.. తెలంగాణ సహకార సొసైటీల చట్టంలో ఆ వెసులుబాటు ఉన్నదా?.. లేదంటే చట్ట సవరణ చేయాల్సి ఉంటుందా?.. ఎన్నికలు లేకుండా నామినేటెడ్ పద్ధతిలో పదవులను (Nominated Posts) కట్టబెట్టొచ్చా?.. ఇలాంటి అనేక సందేహాల నడుమ రాష్ట్ర సర్కార్ త్వరలో నిర్ణయం తీసుకోనున్నది. లీగల్ చిక్కులపై న్యాయ నిపుణుల సలహాలను తీసుకున్నది. వాటిని పరిగణనలోకి తీసుకుని త్వరలోనే నిర్ణయాన్ని వెలువరించనున్నది. చట్టానికి సవరణలు చేయాల్సిన అవసరం లేకుండానే నామినేటెడ్ పద్ధతిలో పదవులు ఇవ్వొచ్చని, సొసైటీల్లో సభ్యులు కాకపోయినా నామినేట్ చేయొచ్చని లీగల్ నిపుణులు సూచించారు. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌తోనే సొసైటీలకు పాలకమండళ్ళను నియమించవచ్చనే అభిప్రాయాలు వచ్చినట్లు తెలిసింది.

నామినేషన్ పద్ధతిలోనే పదవులు :

రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు సహా జిల్లా, రాష్ట్ర కేంద్ర సహకార బ్యాంకుల పాలకమండళ్ళను ప్రభుత్వం ఇటీవల రద్దు చేసింది. ఆ స్థానంలో తాత్కాలికంగా అధికారులకు బాధ్యతలు అప్పజెప్పింది. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమవుతున్న నేపథ్యంలో సహకార చట్టానికి సవరణ చేయడంపై చర్చలు మొదలయ్యాయి. కొత్త పాలకమండళ్ళు కొలువుదీరాలంటే చట్ట సవరణలు అవసరమనే వాదనలు వచ్చాయి. ఎన్నికలు నిర్వహించకుండా నామినేట్ చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని, చట్టంలోనే ఆ వెసులుబాటు ఉన్నదని న్యాయ నిపుణులు ప్రభుత్వానికి సూచించారు. ప్రభుత్వం ఉత్తర్వుల ద్వారానే నామినేషన్ పద్ధతిలో పాలకమండళను నియమించవచ్చని వివరించారు.

సభ్యులు కాకపోయినా డైరెక్టర్లుగా :

తెలంగాణ సహకార సొసైటీల చట్టానికి సవరణలు చేయాల్సిన అవసరం లేకుండానే పాలకమండళ్ళను నామినేట్ చేసే వెసులుబాటు ఆ చట్టంలోనే ఉన్నట్లు న్యాయశాఖ సైతం ప్రభుత్వానికి వివరణ ఇచ్చినట్లు తెలిసింది. సొసైటీల పాలకమండళ్ళలో బాధ్యతలు నిర్వర్తించాలంటే అందులో సభ్యులుగా ఉండాల్సిన అవసరం కూడా లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో పార్టీలో ఇప్పటివరకు పదవులు రాని శ్రేణులకు నామినేషన్ పద్ధతిలో సొసైటీల పాలకమండళ్లలో పోస్టులు (Nominated Posts) దక్కే అవకాశాలున్నాయి. దీంతో ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీ (ప్యాక్స్) పాలకమండళ్లలో కాంగ్రెస్ కేడర్‌కు అవకాశాలు దక్కనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఎలాగూ సహకార చట్టంలోనే ప్రత్యేక క్లాజ్ ఉన్నందున లీగల్ చిక్కులకు ఆస్కారం ఉండదనే న్యాయశాఖ అభిప్రాయం మేరకు ప్రభుత్వం త్వరలోనే అధికారిక ఉత్తర్వులను వెల్లడించే అవకాశాలున్నాయి.

Read Also: అమ్మో… ఏడాదిలో ఇంత బంగారం కొన్నారా?

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>