కలం డెస్క్ : బంగారం అనగానే మనకు గ్రాములు, తులాలు గుర్తుకొస్తాయి. కేజీల్లో ఊహించుకోవడం కష్టమే. ఇక క్వింటాళ్ళు, టన్నుల గురించి మాట్లాడే ధైర్యం కూడా రాదు. రోజురోజుకూ బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతుండడంతో కొనాలంటే ఆచితూచి అడుగేయాల్సి వస్తున్నది. కూతురి పెళ్ళి ఆలోచన రాగానే ఠక్కున బంగారం గుర్తుకొస్తుంది. మార్కెట్ ధరను చూసి ఒక్కసారిగా టెన్షన్ పడతాం. తల్లిదండ్రుల ఆందోళనను మాటల్లో వర్ణించలేం. ఇట్లాంటి పరిస్థితుల్లో దేశంలో ఏడాది మొత్తంలో జనం ఎంత బంగారాన్ని కొన్నారో అని లెక్కించే ప్రయత్నం చేస్తే అది అంచనాకు కూడా అందదు. గతేడాది మన దేశంలో మనం కొన్న బంగారం 802 టన్నులు. అంటే, 8 లక్షల కిలోలపైనే. తులాల్లో చెప్పుకోవాల్సి వస్తే ఇది 8 కోట్లు. ఇందులో సగం ఆభరణాల విక్రయాలే (Gold Sales).
తగ్గేదే లే… అనే తీరులో కొనుగోళ్ళు :
తప్పనిసరి పరిస్థితుల్లో కొనేవారు కొందరైతే ఎప్పటికైనా అది మనల్ని ఆదుకుంటుందని కొనేవారు ఇంకొందరు. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్, ఇండియన్ జువెల్లర్స్ అసోసియేషన్ లెక్కల ప్రకారం గతేడాది (2024లో) పన్నెండు నెలల్లో దేశవ్యాప్తంగా మొత్తం 802.80 టన్నుల సేల్స్ జరిగింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి డిసెంబరు వరకు తొమ్మిది నెలల్లోనే (ఈ నెల 25 నాటికి) 462 టన్నులకు చేరుకుంది. వచ్చే ఏడాది మార్చి చివరినాటికి మరో 190 టన్నుల సేల్స్ జరగొచ్చని అంచనా. దీంతో మొత్తం సేల్స్ 700 టన్నులకు చేరుకోవచ్చని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ భావిస్తున్నది. గతేడాది గోల్డ్ సేల్స్ లో చైనాను దాటేసిన భారత్ ఈసారి కూడా అదే రికార్డు నెలకొల్పే అవకాశాలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా గతేడాది 1,877 టన్నుల బంగారం విక్రయాలు (Gold Sales) జరిగితే అందులో భారత్ వాటా 563 టన్నులు.
పెరిగిన కాయిన్స్, బార్స్ సేల్స్ :
బంగారం అనగానే గతంలో ఆభరణాలే గుర్తుకొచ్చేవి. మొత్తం సేల్స్ లో దాదాపు 75% ఆభరణాలే ఉండేవి. కానీ కొవిడ్ అనంతరం పరిస్థితుల్లో ఇన్వెస్ట్ మెంట్ కోసం కొనేవారి సంఖ్య పెరిగింది. ఆభరణాలను అమ్మాలన్నా, ఎక్ఛేంజి చేసుకోవాలన్నా తరుగు పేరుతో కొంత నష్టపోవాల్సి వస్తుంది. కానీ కాయిన్స్, బార్స్ విషయంలో అలాంటిది ఉండదు. అందుకే వీటి సేల్స్ గణనీయంగా పెరిగినట్లు జువెల్లర్స్ అసోసియేషన్ తెలిపింది. 2024లో కాయిన్స్, బార్స్ రూపంలో 240 టన్నుల సేల్స్ జరిగితే ఈ ఏడాది తొమ్మిది నెలల్లోనే అది 230 టన్నులు దాటింది. 2013 తర్వాత కాయిన్స్ రూపంలో సేల్స్ బాగా పెరగడం ఇదే తొలిసారి. ఈ ఏడాది సెప్టెంబరు-డిసెంబర్ మధ్యకాలంలో 117 టన్నుల మేర ఆభరణాల రూపంలో విక్రయాలు జరిగితే మరో 92 టన్నుల మేర కాయిన్స్ రూపంలో సేల్స్ జరిగినట్లు తేలింది. మొత్తం విక్రయాల్లో దాదాపు 40% కాయిన్సే.
ధర పెరగడంతో వ్యాల్యూ డబుల్ :
రెండేండ్ల క్రితం (2023లో) 761 టన్నుల బంగారం విక్రయాల ద్వారా మొత్తం 3.92 లక్షల కోట్ల వ్యాపారం జరిగితే గతేడాది (2024లో) అది 803 టన్నులకు చేరి రూ. 5.15 లక్షల కోట్లకు పెరిగింది. ఈ ఏడాది బంగారం ధరలు ఊహకు అందనంతగా పెరిగిపోవడంతో వచ్చే ఏడాది మార్చి నాటికి వ్యాపారం దాదాపు డబుల్ అవుతుందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనా. బరువురీత్యా గతేడాది రికార్డును దాటకపోయినా ధరలు పెరగడంతో వ్యాపారం మాత్రం దాదాపు ఏడు లక్షల కోట్లు దాటే అవకాశాలున్నాయి. ఎలాగూ జనవరి తర్వాత పెళ్ళిళ్ల సీజన్ ప్రారంభం కానుండడంతో బంగారం వ్యాపారం సరికొత్త రికార్డును సృష్టిస్తుందని జువెల్లరీ వ్యాపారులు భావిస్తున్నారు. దీనికి తోడు రిజర్వు బ్యాంకు సైతం బంగారం నిల్వలను పెంచుకుంటూ ఉన్నది. ఇప్పటికే నాలుగు టన్నుల మేర కొనుగోలు చేసింది.
దేశంలో గోల్డ్ సేల్స్ ఇలా.. :
సంవత్సరం బరువు విలువ
2023 761 టన్నులు 3.92 లక్షల కోట్లు
2024 803 టన్నులు 5.15 లక్షల కోట్లు
2025 700 టన్నులు 7.72 లక్షల కోట్లు
Read Also: పొలిటికల్ అడ్వాంటేజ్‌పై కాంగ్రెస్ స్ట్రాటజీ
Follow Us On: Youtube


