కలం, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఇప్పుడంతా జెన్ జీల చుట్టూ రాజకీయం తిరుగుతున్నది. ఆ తరం వాళ్లను తమ వైపు తిప్పుకునేందుకు ఒకవైపు బీఆర్ఎస్.. ఇంకో వైపు బీజేపీ.. మరోవైపు టీఆర్ఎస్ ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. వారి ఓటు బ్యాంక్ ఎంత? వారు ప్రభావితం చేసే ఓటర్లు ఎంత మంది అని లెక్కలు వేసుకొని మరీ ముందుకు వెళ్తున్నాయి. సభ్యత్వాలను కూడా మొదలుపెట్టాయి. కానీ, అధికార పార్టీ కాంగ్రెస్ (Telangana Congress) లో మాత్రం ఆ హడావిడి కనిపించడం లేదు.
ఇదే అంశంపై ఇటీవల పార్టీ రాష్ట్ర పెద్దల వద్ద ఓ సీనియర్ మంత్రి ప్రస్తావించారు. పలు ప్రశ్నలను లేవనెత్తారు. పార్టీకి ఉన్న జెన్ జీల బలమెంత? వారికి ఇస్తున్న ప్రయారిటీ ఏమిటి? ఇంకా పాత సిద్ధాంతాన్ని పట్టుకొని ఎన్నాళ్లు వేలాడుతాం అంటూ పరిస్థితిని ఆయన సవివరంగా చెప్పారు. జెన్ జీలపై ఫోకస్ పెట్టకపోతే, పార్టీ కేడర్ను అటుగా మళ్లించకపోతే ప్రత్యర్థులకు అస్త్రాలు ఇచ్చినట్లే అవుతుందని నర్మగర్భంగా సదరు మంత్రి హెచ్చరించినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
ఆ మంత్రి చెప్పింది వాస్తవమేనని.. సంస్థాగతంగా బలోపేతం కోసం జెన్ జీ యూత్పై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని గాంధీభవన్ వర్గాల్లో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు రెండున్నరేండ్ల టైమ్ ఉందని చెప్పి లైట్ తీసుకోవద్దని.. ఇప్పటి నుంచే ఆ ఓటు బ్యాంక్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు.
“మన పార్టీలో ‘జెన్-జీ’లు ఎంత మంది ఉన్నారు?.. కనీసం 18-40 ఏజ్ గ్రూపు వారు ఎంత మంది ఉండొచ్చు?.. గాంధీ సిద్ధాంతం ఇప్పటి తరంలో ఎంత మందిని అట్రాక్ట్ చేయగలుగుతుంది?.. అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లయినా ప్రభుత్వానికి, పార్టీకి మధ్య గ్యాప్ ఇంకా ఎందుకు కంటిన్యూ అవుతున్నది?..” ఇవీ దక్షిణ తెలంగాణకు చెందిన ఓ మంత్రి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి, పీసీసీ చీఫ్ ముందు లేవనెత్తిన ప్రశ్నలు. పార్టీకి దీర్ఘకాలంగా లాయల్‌గా ఉన్న ఆ మంత్రి.. రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఉన్న తాజా పరిస్థితిపై వారికి వివరణ ఇచ్చారు.
పార్టీ సంస్థాగతంగా బలోపేతం కావడం ద్వారానే ప్రజల్లోకి చొచ్చుకు పోగలుగుతామని, దానికి అవసరమైన వ్యూహం చాలా కీలకమైనదని చెప్పారు. పార్టీ కార్యకర్తలను ప్రాణంలా కాపాడుకోవడంపై ముఖ్యమంత్రి తరచూ ప్రస్తావిస్తూ ఉంటారని, కానీ ఇప్పటివరకు క్షేత్రస్థాయిలో దానికి తగిన కార్యాచరణ లేదని పేర్కొన్నారు. సీనియర్ మంత్రిగా ఆయన అభిప్రాయాలన్నింటినీ పార్టీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ పాజిటివ్‌గానే తీసుకున్నారు.
హైకమాండ్ ఫెయిల్!
ఇటీవల ‘సర్’ అవగాహనా ప్రోగ్రామ్‌లో భాగంగా మంత్రి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సమావేశం అనంతరం మంత్రి, పార్టీ ఇన్ చార్జి, పీసీసీ చీఫ్ కొద్దిసేపు పార్టీ, ప్రభుత్వ వ్యవహారాలను చర్చించుకున్నారు. ఈ సందర్భంగా జెన్ జీ ఓటర్లు, పార్టీ కేడర్ అంశం ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. ఒక దశలో సదరు మంత్రి.. పార్టీ ఇన్చార్జి, పీసీసీ చీఫ్, హైకమాండ్‌నే ప్రశ్నిస్తున్నారనే అభిప్రాయం కలిగినా.. ఆ తర్వాత ఆ మంత్రి మాటల్లో పార్టీ పట్ల ఉన్న కమిట్‌మెంట్, ఆచరణలో జరుగుతున్న లోపాలు, పొరపాట్లపై ఉన్న ఆవేదనను పార్టీ పెద్దలు స్వీకరించారు.
పార్టీలో సమస్యలను గుర్తించడంలో హైకమాండ్ ఫెయిల్ అయిందనే అభిప్రాయాన్ని మంత్రి సూటిగా చెప్పడంతో సరిదిద్దుకోవడం తక్షణ కర్తవ్యంగా మారింది. ఒకవైపు పదవులు రావడంలేదని, పార్టీ కోసం పదేండ్లు కష్టపడినా గుర్తింపు లేదని, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా నామినేటెడ్ పోస్టుల భర్తీలో అన్యాయమే జరుగుతున్నదనే ఒక సాధారణ అభిప్రాయం కేడర్‌లో నెలకొన్నది. దీనికి మంత్రి వ్యాఖ్యలు బలం చేకూర్చాయి.
జూమ్ మీటింగ్స్ తో నో యూజ్
ఇప్పటివరకు ఇచ్చిన పదవుల్లో పార్టీ కోసం సీరియస్‌గా పనిచేసినవారిలో ఎంతమందికి దక్కాయన్నది మంత్రి, పార్టీ ఇన్చార్జి, పీసీసీ చీఫ్ సమావేశంలోని కీలక అంశంగా చర్చకు వచ్చినట్లు తెలిసింది. పార్టీ అధికారంలోకి రావడానికి కారణమైన కేడర్‌కు న్యాయం చేస్తున్నామా లేదా అని చూసుకోవడంలో నాయకత్వం బాధ్యత అని ఆ మంత్రి సూటిగానే ప్రస్తావించారు. తరచూ జూమ్ మీటింగులు నిర్వహించడం వల్ల ప్రయోజనం ఏమీ ఉండదని, అలాంటి సమావేశంలో కింది స్థాయి నుంచి మంత్రుల వరకు అందరూ పాల్గొంటున్నందున అంతర్గత విషయాలను, ఆవేదనను చెప్పుకోడానికి తగిన వేదిక కాదని మంత్రి వివరించారు.
ఎప్పుడూ ఆ ఐదారుగురు లీడర్లకే మాట్లాడే చాన్స్ వస్తున్నదని.. దీనికి బదులు కోర్ మీటింగులు నిర్వహిస్తేనే కేడర్ తమ మనసు విప్పి మాట్లాడగలుగుతుందని సూచించారు. అందర్నీ ఒకేసారి పిలిస్తే నెగెటివ్ అంశాలను చాలామంది మాట్లాడలేరని పేర్కొన్నారు. పార్టీ నాయకత్వం ఇలాంటి ప్రాక్టికల్ విషయాలపై ఆలోచించకపోతే ఆర్గనైజేషన్‌కే ఇబ్బందులుంటాయన్నారు. నియోజకవర్గ స్థాయిలో తొలుత సమావేశాలు జరిగితే గ్రౌండ్‌లో పార్టీ కేడర్ అభిప్రాయాలు ఏ విధంగా ఉంటాయో నాయకత్వానికి అర్థమవుతుందని సూచించారు.
కేడర్‌ను నిర్లక్ష్యం చేస్తే కష్టమే
లీడర్లకు, కేడర్‌కు మధ్య ఎక్కడ గ్యాప్ ఉన్నదో తెలియాలంటే తగిన ఫోరమ్ మీద చర్చించాలని, ఆ చర్చల్లో వచ్చే అంశాలు, అభిప్రాయాలకు అనుగుణంగా తగిన నిర్ణయాలు తీసుకోడానికి వీలవుతుందని పార్టీ ఇన్ చార్జి, పీసీసీ చీఫ్‌కు మంత్రి సూచించినట్లు సమాచారం. అసలు చర్చే జరగకపోతే పార్టీ ప్రోగ్రామ్‌ను రూపొందించుకోవడమే సాధ్యం కాదన్నారు. పార్టీని ఓన్ చేసుకునేవాళ్లని పట్టించుకోకపోతే లీడర్లు, కేడర్ దూరమవుతారని.. దిద్దుబాటు చర్యలు తీసుకోకుంటే భవిష్యత్తులో క్షేత్రస్థాయిలో పార్టీకి వాయిసే ఉండదని అభిప్రాయపడ్డారు.
పార్టీ పదవుల కంటే ప్రభుత్వ పదవులు తీసుకోవాలనే ఎక్కువమంది కింది స్థాయి లీడర్లు, కేడర్ ఆలోచిస్తున్నారని.. ఆ తర్వాత పార్టీకి సర్వీస్ చేసే మెకానిజం తగ్గిపోతుందని, దీనిపైన మేధోమథనం చేయాల్సిన అవసరాన్ని సదరు మంత్రి చెప్పినట్లు తెలిసింది. ఈ విషయాలన్నింటినీ సీరియస్‌గా చర్చించాలనే అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. మంత్రి ముక్కుసూటిగా చెప్పిన విషయాలపై నాయకత్వం ఎలాంటి యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నది కీలకం.
గాంధీభవన్ దాటి ప్రజల్లోకి వెళ్లాలి
కాంగ్రెస్ పార్టీ గాంధీభవన్ దాటి బయటికి రాలేకపోతున్నదనే అభిప్రాయానికి బలం చేకూర్చే తరహాలో మంత్రి వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. ఈ వ్యాఖ్యలతో ఇన్‌చార్జి, పీసీసీ చీఫ్ ఆలోచనలో పడ్డట్లు తెలిసింది. ఆర్ఎస్ఎస్‌ను తిట్టడం వల్ల ప్రయోజనం ఉండదని, క్షేత్రస్థాయిలో ప్రజల మనసును గెల్చుకోడానికి, బీజేపీ సిద్ధాంతాన్ని ప్రచారం చేయడానికి ఆర్ఎస్ఎస్ తీసుకుంటున్న చొరవను పరిశీలించడంపై ఈ సమావేశంలో ముగ్గరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం.
కాంగ్రెస్ యాక్టివిటీస్ మాత్రం ఎన్నికలకు కేవలం మూడు నెలల ముందు మొదలవుతుందని, ఎలక్షన్స్ అయిపోగానే పార్టీ పునాది గురించి మర్చిపోవడం రోటీన్ ప్రాక్టీస్‌గా మారిందన్న అంశం ప్రస్తావనకు వచ్చింది. గ్రామ స్థాయిలో పార్టీ కేడర్‌ను కాపాడుకుంటే పునాది బలంగా ఉంటుందని, పార్టీ ఐడియాలజీని జనంలోకి తీసుకెళ్లగలమని, ఇప్పటి నుంచే సంస్థాగతంగా కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలన్న అభిప్రాయం వ్యక్తమైంది. గాంధీభవన్‌ను దాటి ప్రజల్లోకి వెళ్లినప్పుడే పార్టీ బలంగా ఉంటుందన్నది ఆ సమావేశం సారాంశం.
జెన్-జీ ఆలోచన వేరు
గాంధీ సిద్ధాంతాలు గొప్పవి అయినప్పటికీ కొత్తగా పుట్టుకొస్తున్న తరాల యూత్ మాత్రం ‘నియో-నేషనలిజం’పై చర్చిస్తున్నారని పార్టీ ఇన్చార్జి, పీసీసీ చీఫ్ వద్ద సదరు మంత్రి ప్రస్తావించినట్లు తెలిసింది. కాంగ్రెస్ పార్టీ తన సిద్ధాంతాన్ని వివరించే అంశం ఎలా ఉన్నా జెన్-జీ ఆలోచనలకు తగినట్లుగా ఆల్టర్నేటివ్ నెరేటివ్ క్రియేట్ చేయకపోతే జనంలోకి విస్తృతంగా చొచ్చుకుపోలేమనే చర్చ జరిగింది.
పార్టీలోని సభ్యత్వాన్నే పరిశీలిస్తే కొత్త ఓటర్లు, యువకులు, 18-40 సంవత్సరాల ఏజ్ గ్రూపులో ఉన్నవారు ఎంతమంది ఉంటారని మంత్రి ప్రస్తావించారు. ఈ తరం ఓటర్లను, చదువుకున్న యువతను పార్టీ అట్రాక్ట్ చేయలేకపోతున్నదని, పార్టీ సిద్ధాంతం నచ్చి వచ్చినప్పటికీ వారిని పట్టించుకోవడంలేదన్న అభిప్రాయం ఉన్నదని గుర్తుచేశారు. దీన్ని పార్టీ వైఫల్యంగానే భావించాలని, ఉన్నవారిని నిలబెట్టుకోవడం, కొత్తవారిని అట్రాక్ట్ చేయడం నిరంతరం జరగాల్సిన ప్రక్రియ అని సూచించారు. పార్టీలో ఎప్పటికీ ఐదారుగురికి మాత్రమే మాట్లాడే అవకాశం ఉంటున్నదని, సెకండ్ ర్యాంక్ లీడర్లలో నెలకొన్న అభిప్రాయాన్ని క్లియర్ చేయాలని సూచించారు.

