Mobile Popup Ad
Mobile Popup Ad

లక్షల చలాన్లు.. కోట్ల బకాయిలు.. హైదరాబాద్‌లో మారని వాహనదారులు

కలం, హైదరాబాద్ బ్యూరో: తలకు హెల్మెట్ ఉండదు..! పైగా మెడను ఒక వైపు వంచి సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూనే డ్రైవింగ్! దానికి తోడు ఓవర్ స్పీడ్!! ఇంకోవైపు రాంగ్ రూట్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్!! ప్రాణాలు పోతున్నా.. అదే నిర్లక్ష్యం. ట్రాఫిక్ పోలీసులు కొరఢా ఝుళిపిస్తున్నా.. మారని వైఖరి. హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో ట్రాఫిక్ చలాన్ల గణాంకాలు పరిశీలిస్తే.. అందులో 40 శాతం ఓవర్ స్పీడ్, మరో 30 శాతం వితౌట్ హెల్మెట్వే ఉంటున్నాయి. ఈ రెండు కమిషనరేట్ల పరిధిలో 12 ఏండ్లలో 8 కోట్లకుపైగా ట్రాఫిక్ చలాన్లు (Traffic Challans) రికార్డయ్యాయి. అంటే ఏటా 70 లక్షల చలాన్లు!! వీటిలో ఎక్కువగా టూవీలర్స్కు సంబంధించినవే ఉన్నాయి.

ఓవర్ స్పీడ్‌దే మొదటి స్థానం

ట్రాఫిక్ చలాన్లలో అత్యధికం ఓవర్ స్పీడ్‌వే. ఔటర్ రింగ్ రోడ్, ఫ్లైఓవర్లతోపాటు జనం రద్దీగా ఉండే ఏరియాల్లోనూ కొందరు అతివేగంతో దూసుకువస్తున్నారు. దీంతో వేల సంఖ్యలో ఈ-చలాన్లు నమోదవుతున్నాయి. ద్విచక్ర వాహనదారుల్లో హెల్మెట్ ధరించకపోవడం మరో ప్రధాన ఉల్లంఘనగా కొనసాగుతున్నది. ఫోర్ వీలర్స్ డ్రైవర్లు సీట్‌బెల్ట్ పెట్టుకోకపోవడం కూడా ఇంకో కారణం. సిగ్నల్ జంపింగ్, ట్రిపుల్ రైడింగ్, మొబైల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్, రాంగ్ పార్కింగ్ వంటి ఉల్లంఘనలు కూడా పెద్ద సంఖ్యలో రికార్డు అవుతున్నాయి.

చలాన్ పడినా… మళ్లీ అదే తప్పు

ఒకే వాహనంపై పదుల సంఖ్యలో చలాన్లు పెండింగ్‌లో ఉంటున్నాయి. కొందరు జరిమానా చెల్లించకుండానే అదే వాహనంతో రోడ్లపై తిరుగుతున్నారు. దీంతో చలాన్ కేవలం జరిమానాగా మాత్రమే మిగిలిపోతున్నదే తప్ప, ప్రవర్తనలో మార్పు తీసుకురావడంలో పూర్తి స్థాయిలో ఫలితం ఇవ్వడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. హైదరాబాద్ నగరంలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, వేల సంఖ్యలో సీసీ కెమెరాలు, ఈ-చలాన్ వ్యవస్థ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ట్రాఫిక్ పర్యవేక్షణ వంటి ఆధునిక సాంకేతిక వ్యవస్థలు అందుబాటులో ఉన్నాయి. ఉల్లంఘన జరిగిన కొద్ది నిమిషాల్లోనే వెహికల్ ఓనర్ మొబైల్‌కు చలాన్ సమాచారం చేరుతున్నది. అయినప్పటికీ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలనే బాధ్యత పెరగాల్సిన స్థాయిలో పెరగడం లేదని నిపుణులు అంటున్నారు.

పన్నెండేండ్లలో రూ. 1,717 కోట్ల వసూళ్లు

  • రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఏటేటా ట్రాఫిక్ చలాన్లు (Traffic Challans) పెరిగిపోతున్నాయి. పన్నెండేండ్లలో హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో 8 కోట్ల వరకు చలాన్లు పడ్డాయి. నెలకు సగటున ఆరు లక్షల చలాన్లు. ఇక్కడ ఈ పుష్కరకాలంలో మొత్తం రూ. 3,288 కోట్ల మేర చలాన్లు వేస్తే.. అందులో రూ. 1,717 కోట్లు వసూలయ్యాయి. ఇంకా రూ. 1,571 కోట్ల మేర వసూలు కావాల్సి ఉన్నది.
  • టెక్నాలజీ పెరగడంతో ట్రాఫిక్ ఉల్లంఘనలపై కేసులు బుక్ అవుతున్నా ఆ వాహనాల యజమానుల నుంచి పెనాల్టీ పెద్దగా వసూలు కావడం లేదు. ట్రాఫిక్ చలాన్ల మొండి బకాయిలను వసూలు చేయడానికి కొత్త విధానానికి ప్రభుత్వం ఆలోచన చేసింది. ప్రతీ వాహన యజమాని వివరాలు ఉన్నందున ట్రాఫిక్ చలాన్ల ఫైన్‌ను ఆటోమేటిక్‌గా వారి బ్యాంకు ఖాతాల నుంచి కట్ చేసుకోవాలన్నది ఆ ఆలోచన. కానీ దీనిపై ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో అమలు అర్ధంతరంగా ఆగిపోయింది.
    వాహనాల సంఖ్య కోటిపైనే
  • హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో ఏటేటా వాహనాల సంఖ్య పెరిగిపోతున్నది. రాష్ట్ర రాజధానిలో కోటికిపైగా వాహనాలు ఉన్నాయి. అదే స్థాయిలో ట్రాఫిక్ ఒత్తిడి పెరుగుతున్నది. ఉల్లంఘనలూ పెరిగిపోతున్నాయి.

డూప్లికేట్ నెంబర్ పేట్లతో చీటింగ్!

ట్రాఫిక్ చలాన్లు జారీ కాకుండా కొందరు కొత్త టెక్నిక్‌లు అమలు చేస్తున్నారు. వెహికల్ నెంబర్‌లో కొన్ని డిజిట్‌లు కనిపించకుండా నెంబర్ ప్లేట్‌ను మడతపెట్టడం పాత పద్ధతి. కానీ ఇప్పుడు బోగస్ నెంబర్ ప్లేట్‌లను తగిలించుకోవడం మొదలైంది. ఇతరుల వాహనాల నెంబర్ ప్లేట్‌లను తగిలిస్తూ ఫైన్ నుంచి తప్పించుకునే ట్రిక్స్ ఇటీవల వెలుగుచూశాయి. డ్రైవింగ్ సీట్‌లో కూర్చునే హైడ్రాలిక్ సిస్టమ్ పద్ధతిలో ఒరిజినల్ నెంబర్ ప్లేట్ స్థానంలో సెకన్ల వ్యవధిలోనే కొత్తది అమరేలా లేటెస్ట్ టెక్నాలజీని వాడుతున్నట్లు ట్రాఫిక్ పోలీసులు ఈ మధ్యనే ఓ లగ్జరీ కార్ విషయంలో కనిపెట్టారు. ఎలాంటి టెక్నాలజీ అమల్లోకి వచ్చినా వెహికల్ నెంబర్ ఆధారంగా ఓనర్ అడ్రస్‌ను కనిపెట్టడం పోలీసులకు సవాలుగా మారింది. ఈ ప్రాక్టికల్ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం ప్రతీ వాహన యజమాని వారి మొబైల్ నెంబర్, ఈ-మెయిల్‌ను పరివాహన్ పోర్టల్‌లో నమోదు చేయాలని, అడ్రస్‌ను అప్‌డేట్ చేసుకోవాలని నిబంధనలు పెట్టింది. ఇకపైన పోస్టు ద్వారా చలాన్లను ఇంటికి పంపడానికి బదులు డిజిటల్ పద్ధతిలోనే చేరవేయాలని భావించింది.

డిసౌంట్ల స్కీమ్‌తో మరింత అతిగా..!

ట్రాఫిక్ ఉల్లంఘనలపై అవగాహన కలిగిస్తున్నా, చలాన్ల పేరుతో జరిమానాలు వేస్తున్నా, కొన్ని సందర్భాల్లో కఠిన చర్యలు తీసుకుంటున్నా ఆశించిన తీరులో వాహనదారుల్లో మార్పు రావడంలేదు. సీసీ కెమెరాలు, ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ వ్యవస్థ, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్, ఈ-చలాన్.. ఇలాంటి ఎన్ని విధానాలు అమలవుతున్నా ఉల్లంఘనలు తగ్గడంలేదు. ఏటా రోడ్డు ప్రమాదాలకు ఓవర్ స్పీడ్ డ్రైవింగ్, హెల్మెట్ లేని డ్రైవింగే కారణమని తేలుతున్నది. జరిమానా చెల్లించకపోయినా ఇబ్బంది లేదన్న భావన ప్రజల్లో పెరిగిపోవడం.. తరచూ ప్రకటించే డిస్కౌంట్ పథకాలతోనూ నిర్లక్ష్యపు డ్రైవింగ్ పెరిగిపోతున్నదని ట్రాఫిక్ రంగ నిపుణులు చెప్తున్నారు. ట్రాఫిక్ చలాన్ కేవలం ఆదాయ వనరుగానే కాక మోటారు వాహన చట్టం అమలుకు సంబంధించిన ప్రక్రియ అని పోలీసులు తరచూ చెప్తుంటారు. కొందరిపై పదుల సంఖ్యలో చలాన్లు ఉంటున్నాయి. పేమెంట్ చేయకున్నా రోడ్లపై తిరగొచ్చనే అభిప్రాయం ప్రజల్లో నెలకొన్నది. నిర్లక్ష్యపు ధోరణి పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అదనపు ఆదాయ వనరుల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో రెండు కమిషనరేట్ల పరిధిలో వసూలు చేయాల్సిన చలాన్ బకాయిలు రూ.1,571 కోట్లకు పైగా పెండింగ్‌లో ఉండటం గమనార్హం. ట్రాఫిక్ చలాన్‌ను వాహన యాజమానికి అనుసంధానం చేయడం, పెండింగ్ జరిమానాలు ఉన్న వాహనాలకు రిజిస్ట్రేషన్ రిన్యువల్, ఫిట్‌నెస్, యాజమాన్య బదిలీ, ఇన్సూరెన్స్ క్లెయిమ్ వంటి సేవలపై పరిమితులు విధించడం.. ఇలాంటి చర్యలతో ఫలితం ఉండొచ్చన్నది నిపుణుల భావన.

నెలకు ఆరు లక్షలపైనే..!

హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్లలో 12 ఏండ్ల ట్రాఫిక్ చలాన్లు: 8 కోట్లకుపైనే
ఏటా సగటు: 70 లక్షలు
నెలకు సగటు: దాదాపు 6 లక్షలు
రోజుకు సగటు: 18 వేలకుపైగా
వసూలైన జరిమానా: రూ.1,717 కోట్లు
పెండింగ్ జరిమానా: రూ.1,571 కోట్లు
ఎక్కువ చలాన్లు: ఓవర్ స్పీడ్, హెల్మెట్ లేకుండా డ్రైవింగ్

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>