కలం, వెబ్‌డెస్క్: ఇండియన్ ఫుట్‌బాల్ (Indian Football) లీగ్ 2025–26 సీజన్‌లో శ్రీనిధి డెక్కన్ ఎఫ్‌సీ (Sreenidi Deccan FC) ప్రస్థానం డ్రాతో ముగిసింది. గోవాలోని ఫటోర్డా పీజేఎన్ స్టేడియంలో శుక్రవారం డెంపో ఎస్‌సీ (Dempo SC) తో జరిగిన చివరి మ్యాచ్‌ను శ్రీనిధి జట్టు 1-1తో ముగించింది. ఈ డ్రాతో పాయింట్లు పంచుకున్న డెక్కన్ వారియర్స్.. మొత్తం 14 మ్యాచ్‌లలో 26 పాయింట్లతో ప్రస్తుతం లీగ్ పట్టికలో రెండో స్థానంలో నిలిచారు. కాగా, ఈ లీగ్‌లో చివరి మ్యాచ్ మే 23న జరగనుంది. ఈ కీలకమైన ఆఖరి మ్యాచ్ కోసం శ్రీనిధి హెడ్ కోచ్ కార్లోస్ వాజ్ పింటో తుది జట్టులో రెండు మార్పులు చేశారు. సస్పెండైన అజయ్ ఛెత్రి స్థానంలో లాల్‌థాంఖుమా జట్టులోకి రాగా, వార్మప్ సమయంలో ఫాబ్రిస్ కాహ్ గాయపడటంతో అతని స్థానంలో లాల్‌చుంగ్‌నుంగ ఆఖరి నిమిషంలో జట్టులో చేరారు.
మ్యాచ్ ప్రారంభమైన ఐదో నిమిషంలోనే హోస్ట్ టీమ్ డెంపో ఎస్‌సీ ఆటగాడు మార్కస్ జోసెఫ్ కార్నర్ కిక్‌ను హెడర్ ద్వారా గోల్‌గా మలిచాడు. దీంతో డెంపో జట్టుకు తొలి ఆధిక్యం లభించింది. వెనుకంజలో పడిన డెక్కన్ వారియర్స్ స్కోరును సమం చేయడానికి గట్టిగా ప్రయత్నించారు. వింగ్ ప్లే, సెట్-పీసెస్ ద్వారా గోల్ చేయడానికి చాలా అవకాశాలు సృష్టించుకున్నారు. ముఖ్యంగా రొమావియా హెడర్ ద్వారా కొట్టిన బంతిని ప్రత్యర్థి గోల్ కీపర్ అద్భుతంగా అడ్డుకోవడంతో శ్రీనిధి జట్టుకు మంచి అవకాశం చేజారింది. దీంతో మొదటి సగం ముగిసేసరికి శ్రీనిధి డెక్కన్ ఎఫ్‌సీ 0-1తో వెనుకబడింది.
రెండో సగంలో డెక్కన్ వారియర్స్ తమ ఆటలో వేగాన్ని పెంచారు. మిడ్‌ఫీల్డ్‌ను మరింత బలోపేతం చేయడానికి 57వ నిమిషంలో పేప్ గస్సామాను మైదానంలోకి దించారు. వారి నిరంతర శ్రమకు 71వ నిమిషంలో ఫలితం దక్కింది. లాల్‌చుంగ్‌నుంగ ఇచ్చిన క్రాస్‌ను దీపక్ డీపీ హెడర్ ద్వారా గోల్ పోస్ట్ వైపు మళ్లించగా, అక్కడే ఉన్న డిఫెండర్ హాదీ ఇద్రిసౌ దానిని చక్కటి హెడర్‌తో గోల్‌గా మార్చి స్కోరును సమం చేశారు. ఆ తర్వాత విజయం కోసం శ్రీనిధి డెక్కన్ ఎఫ్‌సీ మరిన్ని ప్రయత్నాలు చేసింది. అదనంగా ఇచ్చిన ఆరు నిమిషాల సమయంలోనూ ఇరు జట్లు గోల్ చేయలేకపోయాయి. దాంతో ఈ ఉత్కంఠభరిత పోరు 1-1తో ముగిసింది. సీజన్ ముగింపు మ్యాచ్‌లో ఇరు జట్లు పట్టుదలగా రాణించి క్రీడాభిమానులను అలరించాయి.

