కలం, వెబ్ డెస్క్: తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రస్తుత అసెంబ్లీ సెషన్‌లో పెట్టనున్న ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలిపింది. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను పట్టించుకోని ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల నుంచి 15% లేదా రూ.10 వేలను కత్తిరించి దాన్ని తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలన్నది ఈ బిల్లు ఉద్దేశం. ఈ రెండింటిలో ఏది తక్కువైతే దాన్ని అమలు చేయనున్నది. ఇప్పటికే అసోం రాష్ట్రంలో ‘ప్రణామ్’ పేరుతో చట్టం అమలవుతున్నది. దీనికి కొనసాగింపుగా ఇప్పుడు తెలంగాణలోనూ ఈ తరహా చట్టం ఉనికిలోకి రానున్నది. ఇందుకు సంబంధించిన బిల్లును (Salary Cutting Bill) ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సోమవారం అసెంబ్లీ కమిటీ హాల్‌లో జరిగిన క్యాబినెట్ సమావేశం ఆమోదించింది.
వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల సంక్షేమం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే ఉద్యోగుల జీతాల్లో కోత పెట్టే చట్టాన్ని తేనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గతేడాది అక్టోబరులో ఒకసారి, ఈ ఏడాది సంక్రాంతి ముందు రోజు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఒక అఫీషియల్ కార్యక్రమంలో మరోసారి స్పష్టం చేశారు. బిల్లును బడ్జెట్ సెషన్‌లోనే ప్రవేశపెట్టి చట్టం తేనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా గతంలో శాంతికుమారి రూపొందించిన నివేదికలోని అంశాలతో పాటు ఇటీవల చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు రిపోర్టులోని అంశాలను ప్రభుత్వం పరిశీలించింది. అనంతరం రాష్ట్ర క్యాబినెట్ ఈ నిర్ణయం తీసుకున్నది. ఫైనాన్స్ డిపార్టుమెంటు రూపొందించిన ముసాయిదా బిల్లులోని క్లాజులపై చర్చించి నిర్ణయం తీసుకున్నది.
వృద్ధాప్యంలో ఆలనా పాలనా చూసుకోని, సంక్షేమం గురించి పట్టించుకోని, నిర్లక్ష్యంగా ఉన్న పిల్లలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నది ముఖ్యమంత్రి ఉద్దేశం. ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్న పిల్లల జీతాల్లోంచి కొంత భాగాన్ని తల్లిదండ్రుల రోజువారీ ఆర్థిక అవసరాలకు అందజేయాలన్నది సీఎం ఆలోచన. నిర్లక్యానికి గురైన తల్లిదండ్రులకు కుటుంబ పెద్దగా ప్రభుత్వం ఇప్పటికే ‘ప్రణామ్’ పేరుతో డే కేర్ సెంటర్లను ఓపెన్ చేసింది.
ముందే చెప్పిన కలం : ఉద్యోగుల జీతంలో కోత.. బిల్లుపై క్యాబినెట్‌లో చర్చ !
Read Also: ఉద్యోగి జీతంలో ‘ప్రణామ్’ కట్టింగ్ ఎంత? ప్రభుత్వ పరిశీలనలో 10%-15%!
Follow Us On: Instagram

