ఉద్యోగి జీతంలో ‘ప్రణామ్’ కట్టింగ్ ఎంత? ప్రభుత్వ పరిశీలనలో 10%-15%!

కలం, తెలంగాణ బ్యూరో : వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల సంక్షేమం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే ఉద్యోగుల జీతాల్లో కోత (Salary Deduction) పెట్టేందుకు రాష్ట్ర సర్కార్ రెడీ అవుతున్నది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా గతంలో శాంతికుమారి రూపొందించిన నివేదికలోని అంశాలతో పాటు ఇటీవల చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు రిపోర్టులోని అంశాలను ప్రభుత్వం పరిశీలించింది. ముఖ్యమంత్రి అధ్యక్షతన సోమవారం అసెంబ్లీ కమిటీ హాల్‌లో జరిగే క్యాబినెట్ భేటీలో ఈ అంశంపై చర్చించనున్నది. ఫైనాన్స్ డిపార్టుమెంటు రూపొందించిన ముసాయిదా బిల్లులోని క్లాజులపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నది. బిల్లు రూపంలో ఈ సెషన్‌లోనే అసెంబ్లీ, కౌన్సిల్‌లో ప్రవేశపెట్టి ఆమోదం పొందేలా ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. ఉద్యోగుల జీతాల్లో ఎంత కట్టింగ్ చేయాలనే అంశంపై బిల్లులో స్పష్టత ఇవ్వనున్నది. సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఇది వర్తించనున్నది.

నిర్లక్ష్యానికి పరిహారంగా చట్టం :

వృద్ధాప్యంలో ఆలనా పాలనా చూసుకోని, సంక్షేమం గురించి పట్టించుకోని, నిర్లక్ష్యంగా ఉన్న పిల్లలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నది ముఖ్యమంత్రి ఉద్దేశం. ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్న పిల్లల జీతాల్లోంచి కొంత భాగాన్ని తల్లిదండ్రుల రోజువారీ ఆర్థిక అవసరాలకు అందజేయాలన్నది సీఎం ఆలోచన. నిర్లక్యానికి గురైన తల్లిదండ్రులకు కుటుంబ పెద్దగా ప్రభుత్వం ఇప్పటికే ‘ప్రణామ్’ పేరుతో డే కేర్ సెంటర్లను ఓపెన్ చేసింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రానున్న రోజుల్లో ఇలాంటివి ఉనికిలోకి రానున్నాయి. తల్లిదండ్రులను పట్టించుకోకపోవడమంటే సమాజం గురించి కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడమేననే అభిప్రాయంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ఉద్యోగుల జీతాల్లో కోత పెట్టేలా చట్టాన్ని తీసుకొస్తామని స్పష్టం చేశారు. ఇప్పుడు అందుకు అడుగులు పడుతున్నాయి.

‘ప్రణామ్’ పేరుతో ఇప్పటికే అసోంలో చట్టం :

ఇప్పటికే ‘ప్రణామ్’ (PRANAM) పేరుతో చట్టాన్ని అసోం ప్రభుత్వం అమలు చేస్తున్నది. ‘ఎంప్లాయీస్ పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ అండ్ నార్మ్స్ ఫర్ అకౌంటెబిలిటీ అండ్ మానిటరింగ్ యాక్ట్’ పేరుతో శరభానంద్ సోనోవాల్ (BJP) ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2017లో ఈ చట్టం ఉనికిలోకి వచ్చింది. ఉద్యోగులు అందుకుంటున్న జీతాల్లో (గ్రాస్ శాలరీ) 10% మేర కోత (Salary Deduction) పెట్టి తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాల్లో ప్రతి నెలా జమ చేయడానికి ఈ చట్టం వెసులుబాటు కల్పించింది. ఆ తర్వాత 2018లో కొన్ని సవరణలు చేసింది. పీఆర్‌సీతో (PRC) ఉద్యోగుల వేతనాలు పెరిగినా దానికి అనుగుణంగానే తల్లిదండ్రుల ఖాతాల్లో పడే మొత్తం కూడా పెరుగుతుంది. ఈ చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం అధ్యయనం చేసింది. అదే తరహా చట్టాన్ని రూపొందించేందుకు ఫైనాన్స్ డిపార్టుమెంటు కసరత్తు పూర్తి చేసింది. క్యాబినెట్‌లో చర్చ అనంతరం డ్రాఫ్ట్ బిల్లుకు ఆమోదం లభిస్తే అసెంబ్లీ సమావేశాల్లో పూర్తిస్థాయి బిల్లును పెట్టి ఆమోదం తర్వాత చట్టబద్ధత కల్పించాలని భావిస్తున్నది.

అమలుకు ప్రత్యేక మెకానిజం :

తల్లిదండ్రులను ఉద్యోగులుగా ఉన్న పిల్లలు నిర్లక్ష్యం చేస్తున్నారనే అంశానికి నిర్వచనం, నిర్ధారించడం, ఫిర్యాదులు రావడం, దాన్ని పరిశీలించడం, ఫైనల్ నిర్ణయం తీసుకోవడం, అమలు చేయడం.. ఇలాంటి అన్నింటిపైనా ఈ చట్టం ద్వారా స్పష్టత రానున్నది. ప్రస్తుత సామాజిక, ఆర్థిక పరిస్థితుల్లో వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు ఆర్థిక అవసరాలు ఏ మేరకు ఉన్నాయి, రోజువారీ అవసరాలకు ఎంత ఖర్చవుతుంది, ఎంత మేర ఉద్యోగుల జీతంలో కోత (Salary Deduction) పెడితే తల్లిదండ్రుల అవసరాలు తీరుతాయి.. ఇలాంటి అన్ని అంశాలనూ ప్రభుత్వం ఆ బిల్లులో ప్రస్తావించనున్నది. ఈ చట్టం అమలుకు ప్రత్యేక మెకానిజం అవసరం. అటు తల్లిదండ్రులు, ఇటు ఉద్యోగులుగా ఉన్న పిల్లల ఫిర్యాదులు, గ్రీవెన్స్, అప్పీల్ తదితరాలపైనా ట్రిబ్యునల్ తరహా వ్యవస్థ ఉనికిలోకి రానున్నది.

అసోంలో అమలు జరుగుతున్నదిలా :

ప్రణామ్ పేరుతో అసోం ప్రభుత్వం 2017లో అమల్లోకి తెచ్చిన ఈ చట్టం ప్రకారం నిర్లక్ష్యానికి గురవుతున్నట్లు తల్లిదండ్రులు భావించినట్లయితే ‘డిజిగ్నేటెడ్ అథారిటీ’కి ఫిర్యాదు చేయాలి. దీన్ని పరిశీలించిన అనంతరం ఇరు పక్షాల వాదనలను విని తగిన నిర్ణయాన్ని వెలువరించాలి. ఈ నిర్ణయంతో విభేదించినట్లయితే అప్పీలేట్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించవచ్చు. నిర్దిష్ట గడువు లోగా ఈ ఫిర్యాదులు/దరఖాస్తులు పరిష్కారం కావాలి. ఏదేని పరిస్థితుల్లో జాప్యం జరిగినట్లయితే ప్రణామ్ కమిషన్‌ను ఆశ్రయించవచ్చు. అక్కడ కూడా తీర్పుపై భిన్నాభిప్రాయం ఉన్నట్లయితే అదే కమిషన్‌లో సెకండ్ అప్పీల్ చేసుకోవచ్చు. నిర్దిష్ట గడువులోగా పరిష్కారం కానిపక్షంలో రోజుకు రూ. 100 చొప్పున ప్రణామ్ కమిషన్ పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది.

చీఫ్ కమిషనర్‌గా స్పెషల్ సీఎస్ :

రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టంలోని నిబంధనల మేరకు ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా ప్రభుత్వమే ‘ప్రణామ్’ కమిషన్‌ను నియమిస్తుంది. అదనపు చీఫ్ సెక్రటరీ లేదా స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోదాలోని అధికారి ఈ కమిషన్‌కు చీఫ్ కమిషనర్‌గా వ్యవహరిస్తారు. అతని కింద సెక్రటరీ/కమిషనర్ హోదాలో ఇద్దరు అధికారులు కమిషనర్లుగా ఉంటారు. మొత్తం ముగ్గురితో ఫంక్షన్ అయ్యే ఈ కమిషన్ ఐదేండ్లపాటు ఉనికిలో ఉంటుంది. లేదా ఆ కమిషనర్ల వయసు 65 ఏండ్ల వరకు కొనసాగుతారు. ఆ తర్వాత నోటిఫికేషన్ ద్వారా కొత్త కమిషన్‌ను ప్రభుత్వం నియమిస్తుంది. ఏదేని పరిస్థితుల్లో డిజిగ్నేటెడ్ అథారిటీ లేదా అప్పీలేట్ అథారిటీ ఫిర్యాదులను స్వీకరించకపోయినా నిర్దిష్ట గడువులో పరిష్కరించి నిర్ణయం వెలువరించకపోయినా కమిషన్‌ను సంప్రదించే వెసులుబాటు అటు తల్లిదండ్రులకు, ఇటు ఉద్యోగులైన పిల్లలకు ఉంటుంది.

అసోం ‘ప్రణామ్’ చట్టంలో 10%-15% కట్టింగ్ :

అసోం ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రణామ్ చట్టం ప్రకారం ఉద్యోగి మొత్తం వేతనంలో కనీసంగా 10% కత్తిరించి దాన్ని తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలి. రాష్ట్రంలోని మొత్తం 4 లక్షల మంది ఉద్యోగులకు ఇది వర్తిస్తుంది. కొత్త పీఆర్సీ ప్రకారం ఉద్యోగుల వేతనాలు పెరిగితే దానికి అనుగుణంగా తల్లిదండ్రులకు కూడా అంతే నిష్పత్తిలో చేరుతుంది. ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులకు కూడా వర్తింపజేయాలని అసోం ప్రభుత్వం భావిస్తున్నది. ఏదేని పరిస్థితుల్లో తల్లిదండ్రులతో పాటు దివ్యాంగులైన పిల్లలు ఉన్నట్లయితే, వారంతా ఆ ఉద్యోగిపైనే ఆధారపడుతున్నట్లయితే 15% మేర కూడా (ప్రత్యేక పరిస్థితుల్లో) కోత పెట్టడానికి ఈ చట్టం అనుమతిస్తుంది. వృద్ధాప్యంలో ఉండి నిర్లక్ష్యానికి గురైన తల్లి లేదా తండ్రి లేదా ఇద్దరికి ఒకరి కంటే ఎక్కువ మంది పిల్లలు ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నట్లయితే వారందరికీ సమభాగాలు చేసి మొత్తంగా 10% లేదా 15% మేర కట్టింగ్ చేయాల్సి ఉంటుంది.

తెలంగాణ చట్టంపైనే ఉద్యోగుల ఉత్కంఠ :

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తొలుత గతేడాది అక్టోబరులో సూచనప్రాయంగా ఈ అంశాన్ని ప్రస్తావించి సంక్రాంతికి ముందు రోజు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రణామ్ డే కేర్ సెంటర్ ప్రారంభోత్సవం సందర్భంగా స్పష్టత ఇచ్చారు. బడ్జెట్ సమావేశాల్లోనే బిల్లు పెడతామని నొక్కిచెప్పారు. దానికి అనుగుణంగా ఇప్పుడు డ్రాఫ్ట్ బిల్లును మంత్రివర్గం చర్చించనున్నది. అసోం తరహాలోనే చట్టం ఉంటుందా?.. అందులో ఉన్న షరతులే ఉంటాయా? అదే తరహా మెకానిజం ఉంటుందా? మొత్తం శాలరీలో 10% కోత ఉంటుందా? లేక 15% కోత పెడుతుందా? గ్రీవెన్స్ మెకానిజం వ్యవస్థ అమలు ఎలా ఉంటుంది? చీఫ్ కమిషనర్, కమిషనర్లుగా ఎవరుంటారు? ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది?.. ఇలాంటి అన్నింటిపై అసెంబ్లీలో పెట్టే బిల్లులో స్పష్టత రానున్నది.

Read Also: ‘కగార్’ కౌంట్ డౌన్.. మిగిలింది పది రోజులే…

Follow Us On: X(Twitter)

 

 

 

 

 

 

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>