కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో భవన నిర్మాణ రంగంపై ప్రభుత్వం కీలక నిర్ణయాలు (New Building Rules) తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగాన్ని క్రమబద్ధీకరించడంతో పాటు, ట్రాన్స్‌ఫరబుల్ డెవలప్‌మెంట్ రైట్స్ (TDR) వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా కొత్త మార్గదర్శకాలను ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసింది. ఈ నూతన నిబంధనల ప్రకారం భవనాల ఎత్తు, సెట్‌బ్యాక్ సడలింపులు, అదనపు అంతస్తుల నిర్మాణానికి సంబంధించి విప్లవాత్మక మార్పులు చోటుచేసుకోనున్నాయి.
ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, 21 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న భవనాలను ఇకపై హైరైజ్ భవనాలుగా పరిగణించనున్నారు. ముఖ్యంగా 750 నుండి 2000 చదరపు మీటర్ల విస్తీర్ణం కలిగిన ప్లాట్లలో 18 నుండి 21 మీటర్ల ఎత్తులో నిర్మించే భవనాలకు TDR సమర్పించడం తప్పనిసరి చేశారు. నాన్ హైరైజ్ భవనాలకు సైతం TDR ద్వారా సెట్‌బ్యాక్ సడలింపులు పొందే వెసులుబాటును కల్పించగా, హైరైజ్ భవనాల్లో పది శాతం వరకు సెట్‌బ్యాక్ రిలాక్సేషన్‌కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ప్లాట్ పరిమాణం, రోడ్డు వెడల్పు ఆధారంగా అదనపు అంతస్తుల నిర్మాణానికి ప్రభుత్వం కొత్త వెసులుబాటు కల్పించడం గమనార్హం. 2000 చదరపు మీటర్లకు పైగా వైశాల్యం ఉన్న ప్లాట్లలో, అందుబాటులో ఉన్న రోడ్డు వెడల్పును బట్టి అదనపు ఫ్లోర్ల నిర్మాణానికి అనుమతిస్తారు. ఉదాహరణకు, 40 అడుగుల రోడ్డు ఉన్న చోట మూడు అదనపు అంతస్తులు, 60 అడుగుల రోడ్డు వద్ద నాలుగు, 80 అడుగుల రోడ్డు ఉంటే ఐదు అదనపు అంతస్తుల వరకు నిర్మించుకోవచ్చు. అయితే, పది అంతస్తుల కంటే ఎక్కువ ఉన్న భవనాలకు TDR వినియోగాన్ని ప్రభుత్వం ఖచ్చితం చేసింది. అలాగే 20 అంతస్తుల పైబడిన భవనాలకు ఐదు శాతం TDR లోడింగ్ నిబంధనను వర్తింపజేశారు.
భవన నిర్మాణ అనుమతుల ప్రక్రియలోనూ పారదర్శకత కోసం ప్రభుత్వం కొత్త విధానాన్ని ()New Building Rules ప్రవేశపెట్టింది. బిల్డింగ్ పర్మిషన్ పొందే సమయంలోనే 50 శాతం TDRను తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. మిగిలిన 50 శాతాన్ని ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ తీసుకునే ముందు చెల్లించేలా నిబంధనలను రూపొందించారు. ఈ మార్పుల ద్వారా నగరాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి, క్రమబద్ధమైన పట్టణీకరణకు మార్గం సుగమం అవుతుందని అధికారులు భావిస్తున్నారు.
Read Also: ప్రధాని మోదీ సరికొత్త రికార్డ్.. బండి సంజయ్ హర్షం
Follow Us On: Instagram

