కలం, వెబ్ డెస్క్ : సరిహద్దు భద్రతా ఆందోళనల నేపథ్యంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. నేపాల్, భూటాన్ మార్గాల్లో ప్రయాణించే వారి కోసం ఇమ్మిగ్రేషన్ నిబంధనల (New Immigration Rules)ను కఠినతరం చేస్తూ ఒక నోటిఫికేషన్ జారీ చేసింది.
ఈ కొత్త నిబంధనల ప్రకారం, భారత్ నుంచి నేరుగా నేపాల్ లేదా భూటాన్‌కు ప్రయాణించే పౌరులకు పాస్‌పోర్ట్ నిబంధన నుంచి మినహాయింపు కొనసాగుతుంది. అయితే, వారు నిర్దేశిత గుర్తింపు పత్రాల తనిఖీలకు తప్పనిసరిగా లోబడి ఉండాలి.
అదే సమయంలో, నేపాల్ లేదా భూటాన్ మీదుగా మూడో దేశానికి వెళ్లాలనుకునే భారతీయ పౌరులు ఇకపై తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్ కలిగి ఉండటంతో పాటు నిర్ణీత ఇమ్మిగ్రేషన్ చెక్‌పోస్టుల ద్వారానే ప్రయాణించాల్సి ఉంటుంది. ఇక చైనా, హాంకాంగ్, మకావు లేదా పాకిస్థాన్ మార్గాల ద్వారా భారత్‌కు వచ్చే నేపాల్, భూటాన్ పౌరులు చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్‌తో పాటు వీసా పొందడం తప్పనిసరి.

