కలం, వెబ్ డెస్క్ : ఏపీలో వాయిదా పడిన ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల పరిధిలోని పలు మండలాలతో పాటు నంద్యాల జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ (AP ZPTC MPTC) స్థానాలకు పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి ఓటింగ్ ప్రక్రియ మొదలుకాగా, కలెక్టర్ రాజకుమారి స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
తూర్పుగోదావరి జిల్లా గోపాలపురంలో 1 జడ్పీటీసీ, 18 ఎంపీటీసీ స్థానాలకు, ఏలూరు జిల్లా బుట్టాయిగూడెంలో 1 జడ్పీటీసీ, 15 ఎంపీటీసీ స్థానాలకు, జీలుగుమిల్లిలో 1 జడ్పీటీసీ, 9 ఎంపీటీసీ స్థానాలకు, పోలవరంలో 1 జడ్పీటీసీ, 11 ఎంపీటీసీ స్థానాలకు అలాగే వేలేరుపాడులో 1 జడ్పీటీసీ, 7 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది.
మరోవైపు నంద్యాల జిల్లాలో కూడా స్థానిక ఎన్నికల పోలింగ్ ఉత్సాహంగా సాగుతోంది. జిల్లా వ్యాప్తంగా 20 జడ్పీటీసీ, 244 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 1,238 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, అందులో 193 అతి సమస్యాత్మక కేంద్రాలుగా, 73 సమస్యాత్మక కేంద్రాలుగా అధికారులు గుర్తించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సమస్యాత్మక కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ ద్వారా పటిష్ట నిఘా ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ రాజకుమారి తెలిపారు.

