కలం, వెబ్ డెస్క్ : భారత రాజకీయ యవనికపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) అరుదైన మైలురాయిని అధిగమించారు. అత్యధిక కాలం ప్రభుత్వ అధినేతగా సేవలందించిన భారతీయ నాయకుడిగా ఆయన సరికొత్త రికార్డు సృష్టించారు. ఇప్పటివరకు ఈ రికార్డు సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ పేరిట ఉండగా, తాజాగా మోదీ ఆ రికార్డును తిరగరాశారు. చామ్లింగ్ మొత్తం 8,930 రోజుల పాటు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించగా, ప్రధాని మోదీ నేటితో 8,931 రోజులను పూర్తి చేసుకున్నారు.
ఈ చారిత్రక సందర్భంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ (Narendra Modi) ప్రస్థానం గుజరాత్ గడ్డ నుండి ఢిల్లీ గుండె వరకు సాగిందని, ఇది ‘సబ్ కా సాత్, సబ్ కా వికాస్’ శక్తికి నిదర్శనమని ఆయన కొనియాడారు. దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టకముందు గుజరాత్ ముఖ్యమంత్రిగా సుదీర్ఘ కాలం సేవలందించిన మోదీ, అనంతరం వరుసగా మూడుసార్లు లోక్‌సభ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి రికార్డు సృష్టించారని తెలిపారు. దేశ రాజకీయ చరిత్రలో సుదీర్ఘ కాలం అధికార పీఠాన్ని అధిరోహించిన నేతగా ప్రధాని మోదీ నిలిచారన్నారు. ఈ మైలురాయి ప్రతి భారతీయుడికి గర్వకారణమని బండి సంజయ్ (Bandi Sanjay) తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

