కలం, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర ఆదాయ వనరుల (Telangana Revenue) పెంపుపై రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీ (Cabinet Sub Committee) సమావేశమైంది. హైదరాబాద్ సెక్రటేరియట్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka), మంత్రులు శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, సీఎస్ సంజయ్ జాజు కమిటీ సభ్యులతో సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక వనరులను బలోపేతం చేయడం, నిర్ణీత గడువుల్లో ఆదాయ లక్ష్యాలను సాధించడమే లక్ష్యంగా వివిధ శాఖల అధికారులు సమన్వయంతో సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని మంత్రులు ఆదేశించారు. ముఖ్యంగా ల్యాండ్ పూలింగ్, పారిశ్రామిక భూముల క్రమబద్ధీకరణ, పారదర్శక విధానాల్లో భూముల వేలం ద్వారా ఆదాయ సమీకరణను వేగవంతం చేయాలని సూచించారు.
పారిశ్రామికవేత్తల దరఖాస్తుల సత్వర పరిష్కారానికి వారాలవారీ లక్ష్యాలను నిర్దేశించుకోవాలని మంత్రులు ఆదేశించారు. సమర్థ పర్యవేక్షణ కోసం ప్రత్యేక డిజిటల్ డ్యాష్ బోర్డును అందుబాటులోకి తీసుకురావాలని చెప్పారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు, మౌలిక వసతుల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యమిస్తూ రాష్ట్ర ఆర్థిక వృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ మేరకు మంత్రులు స్పష్టం చేశారు.

