కలం, ముథోల్ : రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని దళారులకు విక్రయించి మోసపోవద్దని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ (Pawar Ramarao Patel) సూచించారు. ముథోల్ మండలంలోని విట్టోలి, బ్రాహ్మణగావ్, కరెగాం, బోరెగాం, చింతకుంట, చింతకుంట తండా, ఎడ్బిడ్ తండా, ఎడ్బిడ్, వెంకటాపూర్, చించాల గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను శుక్రవారం ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలనే లక్ష్యంతో ఐకేపీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం ఏ గ్రేడ్ ధాన్యానికి క్వింటాలుకు రూ.2,461, బీ గ్రేడ్ ధాన్యానికి రూ.2,441 మద్దతు ధర ప్రకటించిందన్నారు. మార్కెట్లో ధరలు తగ్గినప్పటికీ రైతులకు ప్రభుత్వ మద్దతు ధర అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. సన్నరకం ధాన్యానికి క్వింటాలుకు అదనంగా రూ.500 బోనస్ అందజేస్తున్నట్లు వెల్లడించారు. రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకొని ప్రభుత్వ మద్దతు ధర పొందాలని ఎమ్మెల్యే సూచించారు.

