కలం డెస్క్ : రాష్ట్ర ప్రభుత్వం రెండు నెలల్లో ప్రవేశపెట్టబోయే బడ్జెట్ (Telangana Budget 2026) ప్రత్యేకంగా ఉండనున్నది. గత బడ్జెట్‌తో పోలిస్తే ఈసారి సైజ్ ఎంత పెరుగుతుందనేది ప్రభుత్వ ప్రయారిటీ కాదు. ఏయే రంగాలకు ప్రాధాన్యత ఉంటుందనేది కీలకం. ఇటీవల గ్లోబల్ సమ్మిట్ (Telangana Global Summit) వేదికగా విడుదల చేసిన తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్‌లో పేర్కొన్న అంశాలకు ప్రభుత్వం ప్రయారిటీ ఇవ్వనున్నది. ఆ రంగాలకు గతంలో ఎన్నటికంటే ఎక్కువ మొత్తంలో నిధుల కేటాయింపు జరగనున్నది. ఇరిగేషన్, ఇండస్ట్రీస్ రంగాలతో పాటు మౌలిక సదుపాయాలు, విద్య, వైద్యం, మహిళా సంక్షేమం తదితరాలపైనే ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇప్పటికే క్యూర్, ప్యూర్, రేర్ (CURE, PURE, RARE) రోడ్‌మ్యాప్‌ను ప్రకటించడంతో ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి ఈ సంవత్సరం నుంచే ప్రాధాన్యత లభించనున్నది.
లెక్కల పద్దు కాదు.. భవిష్యత్ విజన్ :
రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ (Telangana Budget 2026)లో పేర్కొనే అంచనాలు కేవలంలెక్కల పద్దులు కావని.. అభివృద్ధికి వేసే తొలి అడుగు అంటూ గతంలో పలు సందర్భాల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. ఈసారి బడ్జెట్ రూపకల్పన విజన్ డాక్యుమెంట్ (Telangana Rising Vision Document)లోని అంశాలకు అనుగుణంగా ఉంటున్నందున ఇది భవిష్యత్తు విజన్‌కు ఫస్ట్ స్టెప్‌గా ఉంటుందనేది ఆర్థిక శాఖ వర్గాల భావన.
తొలి రెండేళ్ళలో సంక్షేమానికి భారీగానే ఖర్చు చేసిన ప్రభుత్వం దాన్ని కొనసాగిస్తూనే విజన్ డాక్యుమెంట్‌లో పేర్కొన్న విద్య, వైద్యం, మానవ వనరుల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన తదితరాలకు పెద్ద పీట వేస్తుందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఒకవైపు సాగునీటి ప్రాజెక్టులు, మరోవైపు పరిశ్రమల అభివృద్ధి కీలకమైన అంశాలని గుర్తుచేశాయి. వీటి ద్వారా రైతులకు సాగునీరు, యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని నొక్కిచెప్పాయి.
విద్య, వైద్యానికి ప్రాధాన్యత :
విద్యా రంగంపై పెట్టే ఖర్చు నిజానికి భవిష్యత్ తరంపై పెట్టే పెట్టుబడి అంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అనేక సందర్భాల్లో వ్యాఖ్యానించారు. సంప్రదాయక ఐటీఐలను అడ్వాన్స్ స్కిల్ సెంటర్లుగా పేర్కొన్నారు. చదువుకు తగిన ఉపాధి లభించేలా స్కిల్స్ అవసరమే ఉద్దేశంతో ‘యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీ’కి శ్రీకారం చుట్టారు. కులమతాలు, ఆర్థిక తేడాలతో సంబంధం లేకుండా ప్రాథమిక విద్య మొదలు డిగ్రీ వరకు ఒకే గొడుగు కింద చదువుకునేలా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్సుల నిర్మాణాన్ని మొదలుపెట్టారు.
ఇంకోవైపు రానున్న రెండేండ్లలో వైద్యరంగంలో సుమారు రూ. 30 వేల కోట్లను ఖర్చు పెట్టి మౌలిక సౌకర్యాలను కల్పిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించినందున ఈసారి బడ్జెట్‌లో నిధుల కేటాయింపు పెరిగే అవకాశమున్నది. బీపీ, షుగర్, క్యాన్సర్ తదితర నాన్-కమ్యూనికబుల్ డిసీజెస్ స్క్రీనింగ్ అవసరాలను సీఎం ప్రస్తావించడంతో గ్రామ స్థాయి నుంచి ఈ సౌకర్యాల కల్పనకు నిధులను ఖర్చు చేయనున్నది.


