కలం డెస్క్ : తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మూడోసారి దావోస్ సమ్మిట్ టూర్‌కు రేవంత్‌రెడ్డి (CM Revanth Davos Tour) సన్నద్ధమవుతున్నారు. గడచిన రెండుసార్ల పర్యటనల్లో కంటే ఈసారి ఎక్కువ పెట్టుబడులు ఆకర్షించడంపై ఫోకస్ పెట్టారు. ఈ నెల 19-23 మధ్య జరగనున్న సమ్మిట్ కోసం రెండు రోజుల ముందే రాష్ట్ర ఇండస్ట్రీ మినిస్టర్ దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు, అధికారుల బృందం వెళ్తున్నది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మరికొందరు అధికారులతో ఈ నెల 19న బయలుదేరుతున్నారు. తెలంగాణ ప్రతినిధి బృందంలో ఎంఏయూడీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేశ్ రంజన్ (Jayesh Ranjan) కూడా ఉన్నట్లు సచివాలయ వర్గాలు తెలిపాయి. పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సంజయ్ కుమార్ వెళ్తున్నా ఆ శాఖతో సంబంధం లేని జయేశ్ రంజన్ వెళ్ళడం చర్చకు దారితీసింది.
పెట్టుబడుల ఆకర్షణలో కీ రోల్ :
రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచీ పరిశ్రమల శాఖ కార్యదర్శి బాధ్యతలు నిర్వహిస్తున్న జయేశ్ రంజన్ (Jayesh Ranjan) ఇటీవలే ఆ శాఖ నుంచి రిలీవ్ అయ్యారు. ఫ్యూచర్ సిటీ వేదికగా గత నెల 9, 10 తేదీల్లో జరిగిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సమయంలో సీఎంఓలో పరిశ్రమల శాఖ బాధ్యతలు చూసే అధికారిగా ఉన్నారు. ఆ తర్వాత జరిగిన ఐఏఎస్ అధికారుల బదిలీల్లో భాగంగా ఆయన ఎంఏయూడీ (హెచ్ఎండీఏ పరిధి) స్పెషల్ సీఎస్‌గా నియమితులయ్యారు. ఇప్పుడు పరిశ్రమల శాఖతో సంబంధం లేకపోయినా దావోస్ టూర్‌కు అవకాశం దక్కింది. పెట్టుబడులను ఆకర్షించడంలో ఆయనకు పన్నెండేళ్ళ అనుభవం ఉన్నదని, అనేక జాతీయ, అంతర్జాతీయ కంపెనీల పెద్దలతో సంబంధాలు ఉన్నాయని, అందువల్లనే ఆయనకు టీమ్‌లో ప్లేస్‌మెంట్ దక్కిందనేది సెక్రటేరియట్ వర్గాల్లో చర్చ.
టార్గెట్ రీచ్ కావడమే లక్ష్యం :
ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ టైమ్ దావోస్ సమ్మిట్‌కు వెళ్ళిన రేవంత్‌రెడ్డి పలు కంపెనీల ప్రతినిధులతో సంప్రదింపులు జరిపారు. రాష్ట్రంలో సుమారు రూ. 40,232 కోట్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు వివిధ కంపెనీలతో ఒప్పందాలు కుదిరాయి. ఆ తర్వాత సెకండ్ టైమ్ 2025లో సుమారు రూ. 1.78 లక్షల కోట్ల మేర పెట్టుబడులకు ఎంఓయూలు కుదిరాయి. ఈసారి మరింత భారీ స్థాయిలో ఇన్వెస్టుమెంట్లను ఆకర్షించేలా ప్రభుత్వం ప్రణాళిక రచించింది. ఇటీవల జరిగిన గ్లోబల్ సమ్మిట్‌లో సుమారు రూ. 5.75 లక్షల కోట్ల మేర పెట్టుబడులకు ఎంఓయూలు కుదిరాయి. ప్రపంచ స్థాయిలోనే ఇప్పుడు డాటా సెంటర్లు, క్లౌడ్ స్టోరేజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీ కండక్టర్ల తయారీ, క్వాంటం కంప్యూటింగ్ తదితరాలపై ఎక్కువ ఫోకస్ ఉన్న దృష్ట్యా ఆ రంగాలకు చెందిన కంపెనీలను హైదరాబాద్‌కు రప్పించడంపై పరిశ్రమల శాఖ దృష్టి సారించింది.


