కలం, వెబ్ డెస్క్: తెలంగాణ అసెంబ్లీలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో పౌరసరఫరాల శాఖకు రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. ఈ శాఖ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల కోసం మొత్తం 7,366 కోట్ల రూపాయలను ప్రభుత్వం ప్రతిపాదించింది. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆహార భద్రతపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొన్న డిప్యూటీ సీఎం, గత పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న రేషన్ కార్డుల సమస్యను పరిష్కరించినట్లు తెలిపారు.
రాష్ట్రంలోని అర్హులైన పేద కుటుంబాలకు కొత్తగా 15 లక్షల 12 వేల రేషన్ కార్డులను ప్రభుత్వం జారీ చేసింది. అంతేకాకుండా, పాత కార్డుల్లో మరో 19 లక్షల 44 వేల మంది కొత్త సభ్యులను చేర్చినట్లు బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. దీనివల్ల ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం రేషన్ కార్డుల సంఖ్య 1 కోటి 5 లక్షల 7 వేల 879కి చేరింది.
ముఖ్యంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 3 కోట్ల 38 లక్షల మంది లబ్ధిదారులకు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా అన్ని రేషన్ షాపుల నుంచి 6 కిలోల సన్న బియ్యాన్ని ప్రభుత్వం అందిస్తోంది. పేద ప్రజలకు నాణ్యమైన పోషకాహారాన్ని అందించడంతో పాటు వారికి పూర్తిస్థాయిలో ఆహార భద్రత కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు భట్టి విక్రమార్క వివరించారు.
Read Also: రైతు కూలీలకు గుడ్ న్యూస్
Follow Us On : WhatsApp

