కలం, వెబ్ డెస్క్: తెలంగాణ బడ్జెట్ (Telangana Budget 2026-27) వేళ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) అసెంబ్లీ వేదికగా శుభవార్త తెలిపారు. కొన్ని దశాబ్దాల నుంచి ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎదురు చూస్తున్నటువంటి నగదు రహిత ఆరోగ్య భద్రత పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఈ పథకం ఉద్యోగస్తులు, పెన్షనర్లు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులందరికీ వర్తిస్తుందన్నారు. ఇది ప్రభుత్వ ఉద్యోగస్తులకు, పెన్షనర్లకు ఈ ప్రభుత్వం కల్పిస్తున్న భద్రత మరియు భరోసా అని పేర్కొన్నారు. ఈ నగదు రహిత ఆరోగ్య భద్రత (Employees Health Scheme-EHS) పథకాన్ని రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారా అమలు చేస్తామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు 421 ఎంపానెల్ ప్రయివేట్ ఆసుపత్రులలో 1,998 వ్యాధులకు ఈ పథకం ద్వారా చికిత్సను పొందవచ్చని చెప్పారు. ప్రతి ఉద్యోగికి డిజిటల్ హెల్త్ కార్డు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ పథకం ద్వారా దాదాపు 23 లక్షల 51 వేల మంది ప్రభుత్వ ఉద్యోగస్తులు, పెన్షనర్లు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులు లబ్ధి పొందుతారని చెప్పారు.
ఉద్యోగుల భద్రత కోసం దేశంలోనే తొలిసారిగా సమగ్ర ప్రమాద బీమా పథకాన్ని ప్రవేశపెట్టామని భట్టి తెలిపారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ప్రమాదవశాత్తు మరణిస్తే 1 కోటి 20 లక్షల రూపాయల ప్రమాద బీమా వర్తిస్తుందన్నారు. 60 ఏండ్ల వరకు 10 లక్షల రూపాయాల టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్, విమాన ప్రమాదంలో మరణిస్తే 2 కోట్ల రూపాయలు అదనపు కవరేజి లభించే విధంగా ఈ పథకాన్ని రూపకల్పన చేశామని చెప్పారు. ఈ పథకం 7 లక్షల 57 వేల ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు వర్తిస్తుందని చెప్పారు. అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల పదవీ విరమణ ప్రయోజనాలను మంజూరు చేస్తూ, టీచర్లకు 2 లక్షల రూపాయలు, హెల్పర్లకు లక్ష రూపాయలు ఇస్తున్నామని చెప్పారు. 60 ఏళ్ల వయసులో స్వచ్ఛందంగా విధుల్లోంచి విరమించుకున్న వారికి కూడా ఈ ప్రయోజనాలు అందుతాయన్నారు. ఈ ప్రజా ప్రభుత్వం ఉద్యోగులకు, పెన్షనర్లకు పూర్తి స్థాయిలో భరోసా, నమ్మకం కల్పిస్తుందనడానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు.
Read Also: శాసన మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి ఉత్తమ్
Follow Us On: Facebook

