ఒకప్పుడు తెలంగాణ గురించి ఏపీ నేతలు ఏదైనా అంటే పార్టీలకు అతీతంగా తెలంగాణలోని రాజకీయ నాయకులు స్పందించేవాళ్లు. బీఆర్ఎస్ సంగతి సరే కానీ, బీజేపీ నేతలూ మాటకుమాట బదులివ్వడంలో వెనకాడేవాళ్లు కాదు. కానీ, ప్రస్తుతం టీజీ బీజేపీ(Telangana BJP) పరిస్థితి అడకత్తెరలో పోక చెక్క మాదిరి మారింది. కారణం.. అటు ఏపీలో ఎన్‌డీఏ కూటమిలోని తెలుగుదేశం, జనసేనతో కలసి ప్రభుత్వంలో ఉండడం. అందుకే ఏపీ టీడీపీ, జనసేన నాయకులు తెలంగాణ ప్రయోజనాలు, తెలంగాణ విషయంలో ఏవైనా వ్యాఖ్యలు చేసినా టీజీ బీజేపీ నేతలు తమకేమీ పట్టనట్లే ఉంటున్నారు.
కృష్ణా జలాల విషయం కావచ్చు తాజాగా పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ‘దిష్టి’వ్యాఖ్యల విషయంలో కావచ్చు తెలంగాణ బీజేపీ నేతలది అదే దారి. అటుపక్క ఆరు రోజుల తర్వాత అశ్శరభ శరభ అంటూ మంత్రులు, కాంగ్రెస్ నాయకులు, బీఆర్ఎస్ నేతలు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై విరుచుకుపడుతున్నారు. పవన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మంత్రి కోమటిరెడ్డి అయితే ఏకంగా ‘పవన్ క్షమాపణ చెప్పకపోతే అతని సినిమాలు ఆడనివ్వం ’ అంటూ వార్నింగ్ సైతం ఇచ్చారు. కానీ, తెలంగాణ బీజేపీ(Telangana BJP) నేతలు మాత్రం ఇప్పటివరకు స్పందించకపోవడం గమనార్హం. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావుతో సహా ఇప్పటిదాకా ఒక్కరు కూడా దీనిపై నోరు మెదపలేదు. అంతేకాదు, ఇటీవల హిందువులపై పవన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన తెలంగాణ బీజేపీ ఫైర్‌బ్రాండ్ రాజాసింగ్ సైతం సైలెంట్‌గానే ఉండడం గమనార్హం.
కాగా, ఎంకి పెళ్ళి సుబ్బి చావు కొచ్చినట్లు పవన్ వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ మౌనం ఏపీలో టీడీపీ మెడకు చుట్టుకుంది. అదేంటీ? అనుకుంటున్నారా? మిత్రధర్మాన్ని అనుసరించి పవన్ వ్యాఖ్యల విషయంలో బీజేపీ నోరు మెదపడం లేదు. అదే ధర్మాన్ని అనుసరించి తెలంగాణ నేతలపై ఏపీ టీడీపీ విరుచుకుపడాలి కదా? అయితే, అదేమీ లేదు. నిజానికి ఏపీలో టీడీపీ అధికారంలోకి రావడం వెనక పవన్ కళ్యాణ్ పాత్ర కాదనలేనిది. అయినా సరే, ప్రస్తుతం పవన్ వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు మండిపడుతుంటే ఏపీ టీడీపీ నేతలు మాత్రం సైలెంట్‌గా ఉండడంపై జనసేన శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. తమ నేత కష్టపడి టీడీపీ అధికారంలోకి రావడానికి కృషి చేస్తే తెలుగుదేశం నాయకులు కనీసం తమ నాయకుడికి మద్దతుగా మాట్లాడడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
Read Also: గ్లోబల్ సమ్మిట్‌కు క్లాసిక్ కల్చరల్ టచ్
Follow Us on: Facebook


