కలం, వెబ్ డెస్క్: తెలంగాణ జాగృతి రాజకీయ పార్టీగా మారుతుందని ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు (Ramchander Rao) తీవ్రంగా స్పందించారు. ఎవరికైనా రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసుకునే హక్కు ఉందని వ్యాఖ్యానించారు. గతంలో కేఏ పాల్ కూడా పార్టీ పెట్టారని గుర్తు చేశారు. కవిత ఆత్మగౌరవం ఎలా దెబ్బతిందన్నది పూర్తిగా వారి కుటుంబానికి సంబంధించిన అంశమని స్పష్టం చేశారు. ఆమె పార్టీ ఏర్పాటు చేయడం వల్ల బీజేపీకి ఎలాంటి నష్టం కలగదని చెప్పారు.
రాష్ట్ర ప్రజలు ఇప్పుడు బీజేపీ వైపే చూస్తున్నారని, ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీని గుర్తిస్తున్నారని రామచందర్‌రావు వ్యాఖ్యానించారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన రామచందర్‌రావు, బీఆర్‌ఎస్ కుటుంబ రాజకీయాలపై కూడా పరోక్షంగా విమర్శలు చేశారు. ఒకే కుటుంబంలో పదవులు పంచుకోవడమే లక్ష్యంగా రాజకీయ నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. పార్టీలు పెట్టడం ద్వారా ప్రజల్లో విశ్వాసం సంపాదించలేరని, ప్రజాస్వామ్యంలో ప్రజల మద్దతే కీలకమని అన్నారు.
అదే సమయంలో వీబీజీ రామ్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయడాన్ని రామచందర్‌రావు తీవ్రంగా వ్యతిరేకించారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకునే ప్రయత్నమే కాంగ్రెస్ చేస్తున్నదని ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాల కోసం అసెంబ్లీని వేదికగా ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. ఉపాధి హామీ పథకంపై కూడా ఆయన ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఉపాధి హామీ పథకం ద్వారా నిజంగా ఎవరికీ ప్రయోజనం చేకూరడం లేదని అన్నారు. వివిధ రాష్ట్రాల్లో ఈ పథకం పేరుతో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించారు.
పారదర్శకత లేని పథకాలు కొనసాగాలన్నదే కాంగ్రెస్ లక్ష్యమని, అవినీతి వ్యవస్థను కాపాడేందుకే ఇలాంటి స్కీమ్‌లను సమర్థిస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టకుండా రాజకీయ డ్రామాలకు పాల్పడుతోందని రామచందర్‌రావు అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, ఉపాధి, సంక్షేమం వంటి అంశాలపై బీజేపీ స్పష్టమైన విధానంతో ముందుకు వెళ్తోందని, రానున్న రోజుల్లో ప్రజల మద్దతుతో బీజేపీ మరింత బలపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

Read Also: సెలబ్రిటీల వల్ల 80 లక్షలు నష్టపోయా !.. విద్యుత్ టవర్ ఎక్కిన వ్యక్తి
Follow Us On : WhatsApp


