కలం, వెబ్ డెస్క్ : గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం మల్కాపురం గ్రామంలో ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ (Betting Apps)ల కారణంగా సర్వస్వం కోల్పోయిన ఒక వ్యక్తి విద్యుత్ టవర్ ఎక్కి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గ్రామానికి చెందిన రాంబాబు అనే వ్యక్తి ఆన్‌లైన్ గేమ్స్, బెట్టింగ్ యాప్‌లకు అలవాటు పడి సుమారు 80 లక్షల రూపాయల వరకు పోగొట్టుకున్నాడు. సెలబ్రిటీల ఈ బెట్టింగ్ యాప్ ప్రకటనలను చూసి తాను ప్రభావితమయ్యానని, ఆ నమ్మకంతోనే సుమారు 60 లక్షల రూపాయలను అప్పుగా తీసుకువచ్చి మరీ బెట్టింగ్‌లో పెట్టినట్లు బాధితుడు వెల్లడించాడు. ఆకర్షణీయమైన ప్రకటనల వల్ల మోసపోయి, ఇప్పుడు తీర్చలేని అప్పుల ఊబిలో కూరుకుపోయాన్నాడు.
అప్పు ఇచ్చిన వారి నుంచి వేధింపులు ఎక్కువ కావడంతో ఏం చేయాలో పాలుపోని రాంబాబు, తన అప్పులు తీర్చేందుకు కిడ్నీ అమ్ముకుంటానని, అందుకు అనుమతి ఇవ్వాలని గతంలో కోర్టుల చుట్టూ కూడా తిరిగాడు. అయినా సమస్య పరిష్కారం కాకపోవడంతో మనస్థాపానికి గురైన ఆయన, గ్రామంలోని హైటెన్షన్ విద్యుత్ టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించాడు. సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని, అతనికి నచ్చజెప్పి సురక్షితంగా కిందకు దించే ప్రయత్నం చేశారు.

Read Also: రెండు రాష్ట్రాల మధ్య విద్వేషం వద్దు.. ఐకమత్యం కావాలి : చంద్రబాబు
Follow Us On: Sharechat


