కలం, వెబ్ డెస్క్: తెలంగాణ శాసనసభ (Telangana Assembly), శాసనమండలి శీతాకాల సమావేశాలు మంగళవారం నిరవధికంగా వాయిదా పడ్డాయి. శాసనమండలి సాయంత్రానికే వాయిదా పడగా శాసనసభ మాత్రం రాత్రి 10.22 గంటలకు వాయిదా పడింది. మొత్తం ఐదు రోజుల పాటు జరిగిన అసెంబ్లీ సెషన్‌లో శాసనసభలో 40.45 గంటల పాటు సభా కార్యక్రమాలు జరిగాయి. అన్ని పార్టీలకు చెందిన 66 మంది సభ్యులు చర్చల్లో పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన 13 బిల్లులపై చర్చ అనంతరం ఆమోదం లభించింది. ఐదు రోజుల సెషన్‌లో రెండు ప్రభుత్వ తీర్మానాలకు ఆమోదం లభించగా నాలుగు అంశాలపై స్వల్పకాలిక చర్చలు జరిగాయి.
సభా కార్యకలాపాల వివరాలను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సభకు వివరించారు. వివిధ మంత్రిత్వశాఖలకు చెందిన మొత్తం 32 ప్రశ్నలకు సభలో లిఖితపూర్వకంగా సమాధానాలు లభించాయి. ఫిబ్రవరి చివర్లో లేదా మార్చి ప్రారంభంలో రానున్న ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ సమర్పించే సెషన్ జరగనున్నది.
ఆ పదిమందీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే :
బీఆర్ఎస్ తరఫున గెలిచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించారని పదిమంది ఎమ్మెల్యేలు ఆరోపణలు ఎదుర్కొంటున్న సందర్భంలో సభా (Telangana Assembly) కార్యకలాపాల ముగింపు సందర్భంగా ఏయే పార్టీల సంఖ్యాబలం ఎంత ఉన్నదీ స్పీకర్ వెల్లడించారు. అధికారికంగా ఈ సెషన్‌ను బహిష్కరిస్తున్నట్లు బీఆర్ఎస్ (BRS) డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు ప్రకటించి సమావేశాలకు హాజరుకాకపోయినా బీఆర్ఎస్‌కు చెందిన పది మంది ఎమ్మెల్యేలు (వీరు ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు) చివరి వరకూ సమావేశాలకు హాజరయ్యారు. సభను నిరవధికంగా వాయిదా వేసే ముందు స్పీకర్ వెల్లడించిన గణాంకాల ప్రకారం కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు 66 మంది, బీఆర్ఎస్‌కు చెందినవారు 37 మంది, బీజేపీకి చెందినవారు 8 మంది, మజ్లిస్ పార్టీకి చెందినవారు ఏడుగురు, సీపీఐకి చెందినవారు ఒకరు చొప్పున ఉన్నట్లు పేర్కొన్నారు.
Read Also: రుణమాఫీపై కోర్టుకెక్కిన రైతు.. పిటిషన్ దాఖలు
Follow Us On: Instagram


