epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

రుణమాఫీపై కోర్టుకెక్కిన రైతు.. పిటిషన్​ దాఖలు

కలం, వెబ్​ డెస్క్​ :  తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన రూ. 2 లక్షల పంట రుణమాఫీ స్కీమ్ (Crop Loan Waiver Scheme) సక్రమంగా అమలు కాలేదని, లోపభూయిష్టంగా ఉన్నదని, చాలా మంది రైతులకు అందలేదని విపక్షాల నుంచి విమర్శలు వస్తున్న సమయంలో ఓ రైతు హైకోర్టును ఆశ్రయించారు. అన్ని విధాలుగా రుణమాఫీకి తాను అర్హుడిని అయినప్పటికీ ప్రభుత్వం నుంచి తనకు లబ్ధి కలగలేదని హైకోర్టులో (Telangana High Court) దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. భువనగిరి జిల్లా వలిగొండ మండలం జంగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన నర్సింహారెడ్డి అనే రైతు ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. స్వగ్రామంలో తనకున్న వ్యవసాయ భూమిపై అరూర్‌లోని కెనరాబ్యాంకు నుంచి లక్షన్నర రూపాయల పంట రుణాన్ని తీసుకున్నానని, కానీ ప్రభుత్వం తన రుణాన్ని మాఫీ చేయలేదని పిటిషన్‌లో వివరించారు.

అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో రూ. 2 లక్షల లోపు ఉన్న పంటరుణాలు మాఫీ (Crop Loan Waiver Scheme) చేయనున్నట్లు హామీ ఇచ్చి.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ స్కీమ్‌ను అమలు చేసినా.. తనకు మాత్రం రిలీఫ్ కలగలేదని కోర్టుకు వివరించారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారం చాలామంది రైతులకు మాఫీ అయినా తాను మాత్రం లబ్ధిదారుల జాబితాలో లేనని పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం రూ. 2 లక్షల పరిమితి కంటే తక్కువగా ఉన్నవారికి మాఫీ అవుతుందని, కానీ తన పంట రుణం లక్షన్నర ఉన్నా మాఫీ కాలేదన్నారు. అధికారులకు పలుమార్లు విజ్ఞప్తి చేసినా, అర్జీలు ఇచ్చినా ఫలితం లేకపోయిందని, చివరకు కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందన్నారు.

విచారణ వాయిదా..

ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు… రైతు దాఖలు చేసిన పిటిషన్‌, అందులో పేర్కొన్న ఫిర్యాదులపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. నిర్దిష్టంగా ఈ రైతుకు రుణమాఫీ వర్తించలేదన్న అంశంపై సంబంధిత అధికారుల నుంచి వివరాలు సేకరించాల్సి ఉన్నందున కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడానికి కొంత సమయం కావాలని ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టును కోరారు. దీన్ని పరిగణనలోకి తీసుకుని విచారణను వాయిదా వేసింది. చాలా మంది రైతులకు సాంకేతిక సమస్యల కారణంగా మాఫీ కాకపోవడంతో వారికి అదనంగా గడువు ఇచ్చామని, కేస్ టు కేస్ స్టడీ చేసిన ప్రభుత్వ సిబ్బంది చాలా మందికి సాయం అందించారని గతంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఆధార్ కార్డులోని వివరాలు బ్యాంకు ఖాతాకు అనుసంధానం కాకపోవడం, రేషన్ కార్డు వివరాలు మ్యాచ్ కాకపోవడం తదితర సమస్యలతో తొలుత జాప్యం జరిగిందని, గ్రీవెన్స్ కోసం కేటాయించిన సమయంలో అన్నీ క్లియర్ అయ్యాయని అప్పట్లోనే మంత్రి తెలిపారు.

ఒకే కుటుంబంలో ఒకటి కంటే ఎక్కువ రుణాలు ఉన్నప్పుడు ఫ్యామిలీని యూనిట్‌గా తీసుకున్నట్లు వివరణ ఇచ్చారు. కొన్ని సందర్భాల్లో బ్యాంకులోని రికార్డుల్లో రైతు పేరు, సర్వే నంబర్ తదితర వివరాల్లో తప్పులుండడం లేక మ్యాచ్ కాకపోవడంతో లబ్ధిదారులకు సాయం అందలేదని, వీటిని ఆ తర్వాత రెక్టిఫై చేసినట్లు మంత్రి తెలిపారు. ఇప్పుడు ఒక రైతు కోర్టును ఆశ్రయించడంతో ఇలాంటి మిగిలిన రైతులెవరైనా ఉంటే వారి నుంచి కూడా గ్రీవెన్స్ తీసుకుని క్లియర్ చేయాలని కోర్టు ఆదేశిస్తుందేమోననే చర్చలు మొదలయ్యాయి.

Read Also:  అసెంబ్లీ సెషన్ నిరవధిక వాయిదా

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>