epaper
Friday, January 16, 2026
spot_img
epaper

ఉపాధి హామీ పథకంపై శాసనసభ కీలక తీర్మానం

కలం, వెబ్​ డెస్క్​: గ్రామీణ ప్రాంత పేదల పాలిట కల్పవృక్షంగా ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని (MGNREGA) యథాతథంగా కొనసాగించాలని కోరుతూ తెలంగాణ శాసనసభ శుక్రవారం కీలక తీర్మానాన్ని ఆమోదించింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన ‘వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్ గార్ అండ్ ఆజీవిక మిషన్’ (VB-GRAM G-2025) చట్టం పేదల హక్కులను కాలరాసేలా ఉందని సభ ఆందోళన వ్యక్తం చేస్తూ, ఈ కొత్త విధానాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం చేసింది.

గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే లక్ష్యంతో 2005లో యూపీఏ ప్రభుత్వం తెచ్చిన ఈ చట్టం వల్ల గత 20 ఏళ్లుగా రాష్ట్రంలో ఎంతో మంది లబ్ధి పొందారు. తెలంగాణలో ఈ పథకం కింద పని పొందుతున్న వారిలో 90 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల వారు ఉండగా, అందులో 62 శాతం మంది మహిళలే కావడం గమనార్హం. అయితే కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టం డిమాండ్ ఆధారిత ఉపాధి కల్పన విధానానికి స్వస్తి పలికిందని, దీనివల్ల కూలీల హక్కులకు భంగం కలుగుతుందని తీర్మానం పేర్కొంది.

కొత్త చట్టంలో ప్రవేశపెట్టిన పరిమిత కేటాయింపుల విధానం వల్ల పని దినాలు తగ్గిపోయే ప్రమాదం ఉందని, తద్వారా మహిళా సాధికారతకు విఘాతం కలుగుతుందని సభ అభిప్రాయపడింది. గతంలో ఈ పథకానికి కేంద్రమే పూర్తి స్థాయిలో నిధులు కేటాయించేదని, కానీ ఇప్పుడు కేంద్ర-రాష్ట్రాల వాటాను 60:40 నిష్పత్తికి మార్చడం వల్ల రాష్ట్రాలపై అదనపు ఆర్థిక భారం పడటమే కాకుండా సమాఖ్య స్ఫూర్తి దెబ్బతింటుందని తీర్మానం ద్వారా వివరించారు.

ముఖ్యంగా ఈ ఉపాధి హామీ పథకం (MGNREGA) నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించడం గాంధీజీ ఆశయాలను నీరుగార్చడమేనని సభ తీవ్రంగా పరిగణించింది. వ్యవసాయ సీజన్ లో 60 రోజుల పాటు పనులకు విరామం ప్రకటించడం వల్ల భూమి లేని నిరుపేద కూలీలు తీవ్రంగా నష్టపోతారని, కాబట్టి ఏడాది పొడవునా పనులు కల్పించాలని డిమాండ్ చేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న 266 రకాల పనుల జాబితాను అలాగే ఉంచాలని, ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతులకు మేలు చేసే భూమి అభివృద్ధి పనులను తొలగించవద్దని తీర్మానం ద్వారా కోరారు. చివరగా, పేదల ఆకాంక్షలను గౌరవిస్తూ పాత ఉపాధి హామీ చట్టాన్ని ఎటువంటి మార్పులు లేకుండా కొనసాగించాలని తెలంగాణ శాసనసభ కేంద్రాన్ని డిమాండ్ చేసింది.

Read Also: గాంధీ కుటుంబంలో పెళ్లి సందడి.. రాబర్ట్ వాద్రా స్పెషల్​ పోస్ట్​

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>